Reading Time: 2 minutes

జ్వరం, గొంతు నొప్పి అంటే మనం మామూలు జలుబు అనుకుంటాం. కానీ ‘మోనో’ అని పిలిచే ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఇప్పుడు వైద్య లోకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి ‘కిస్సింగ్ డిసీజ్’ అని పేరు. ఇది కేవలం తాత్కాలిక అనారోగ్యమే కాదు, దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నరాలు దెబ్బతినే ‘మల్టిపుల్ స్క్లెరోసిస్’  వంటి ప్రమాదకర జబ్బులకు దారి తీస్తుందని పరిశోధనల్లో తేలింది. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అసలు ఏంటో ఈ ‘కిస్సింగ్ డిసీజ్’?: వైద్య పరిభాషలో దీనిని ‘మోనోన్యూక్లియోసిస్’ లేదా సింపుల్‌గా ‘మోనో’ అంటారు. ఇది ప్రధానంగా ఎప్స్టీన్-బార్ వైరస్ (EBV) వల్ల వస్తుంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇక అందుకే కిస్ చేయడం, ఒకరు తాగిన వాటర్ బాటిల్స్ లేదా డ్రింక్స్‌ను ఇతరులు షేర్ చేసుకోవడం, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది. అందుకే దీనికి ఆ వింత పేరు వచ్చింది.

లక్షణాలు ఎలా ఉంటాయి?: ఈ వ్యాధి సోకినప్పుడు విపరీతమైన అలసట, నీరసం వస్తాయి. దీనితో పాటు గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం మెడలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది ఇవి సాధారణ ఫ్లూ లక్షణాలే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ, వారం దాటినా ఈ సమస్యలు తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ వైరస్ శరీరంలోనే ఉండిపోయి ఇతర సమస్యలకు కారణమవుతుంది.

Kissing Disease Explained: Ignoring It May Lead to Nerve Damage
Kissing Disease Explained: Ignoring It May Lead to Nerve Damage

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. బయట వ్యక్తులతో డ్రింక్స్ లేదా ఫుడ్ షేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇక ఒకవేళ మోనో లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా, డాక్టర్‌ను సంప్రదించి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఆరోగ్యం విషయంలో ఏ చిన్న మార్పు వచ్చినా గమనించడం అవసరం. ‘కిస్సింగ్ డిసీజ్’ అనేది వినడానికి వింతగా ఉన్నా, అది కలిగించే నష్టం మాత్రం చాలా పెద్దది. సరైన పోషకాహారం తీసుకుంటూ, ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఇలాంటి వైరస్‌ల బారి నుండి బయటపడవచ్చు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

The post ‘కిస్సింగ్ డిసీజ్’ నిజం: నిర్లక్ష్యం చేస్తే నరాలు దెబ్బతినే ప్రమాదం appeared first on Manalokam – Latest Telugu News & Updates.