Reading Time: 3 minutes
విశాఖలో ఇరాన్ మహిళల కన్నీటి కష్టం.. బతుకు భారంతో ఆవేదన.. అయినవాళ్ల కోసం ఆందోళన..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు ఆ ఇరానియన్ అక్కాచెల్లెళ్లను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.. ఉన్నత చదువుల కోసం విశాఖ వచ్చిన వారిని యుద్ధ ప్రభావం దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. చేతిలో డబ్బుల్లేవు.. అయిన వాళ్ళు తమ దేశంలో ఎలా ఉన్నారో తెలియదు.. ఫీజులు, అద్దె అంతా ఇరాన్లో ఉన్న కుటుంబం పైనే ఆధారం. కానీ ఇప్పుడు వారి నుంచి కమ్యూనికేషన్ లేదు. ఆర్ధిక పరిస్థితులు ఒకవైపు.. తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన మరోవైపు.. దీంతో విశాఖలో ఎలా బతకాలి.. ఇరాన్ ఎలా వెళ్లాలి..? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు ఇరానియన్ సిస్టర్స్. బతుకు భారమైన తమను ఆదుకోవాలి అంటూ అధికారులను సంప్రదించారు.

ఇరాన్ కు చెందిన జీనాబ్ మొహమ్మది, సోల్మాజ్ మహమ్మదీ సిస్టర్స్.. డి ఫార్మసీ చదివేందుకు విశాఖ వచ్చారు. తమతో పాటు ముగ్గురు పిల్లలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళ చదువులు అయ్యేంతవరకు ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. మరో రెండు నెలల్లో వీరి ఇంటర్న్ షిప్ కంప్లీట్ అవుతుంది. హ్యాపీగా సర్టిఫికెట్లు పట్టుకొని తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు.. సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు వీరిని కష్టాల్లోకి నెట్టేసాయి. ఇరాన్ లో ఉన్న కుటుంబంతో పది రోజుల నుంచి కమ్యూనికేషన్ లేదు. జీనాద్ సోల్మాస్ విశాఖలో అయ్యే ఖర్చు ఎంత కుటుంబమే అక్కడ నుంచి పంపించేది. కానీ యుద్ధం మొదలైన తర్వాత.. అక్కడ ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో యుద్ధ పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులు విశాఖలో ఉన్న జీనాబ్, సొల్మాజ్ కు ఖర్చులకోసం నగదు పంపలేకపోయారు. దీంతో అప్పటినుంచి విశాఖలో ఉంటున్న ఈ ఇరానియన్ సిస్టర్స్ కష్టాలు పెరిగాయి. చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చయింది. ఆర్థిక కష్టాలు విరికి పెరిగాయి.

అధికారులను కలిసి… గోడు వెళ్ళబోసుకొని..

సోల్మాజ్ కుటుంబ సభ్యులు ఇరాన్‌లో వ్యాపారం చేస్తున్నారు. జీ నాకు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందకపోవడంతో విశాఖలో ఉంటున్న ఇద్దరు సిస్టర్స్ కష్టాలు మరింత పెరిగాయి. రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలతో పోషణ కష్టంగా మారింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని వారు అధికారులను కోరారు. కలెక్టరేట్ కు చేరుకొని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ కష్టాన్ని చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. వారి దయనీయ స్థితిని చూసిన అధికారులు స్పందించి భరోసా కల్పించారు.

Iran Womens

Iran Womens

మా కుటుంబాలతో కమ్యూనికేషన్ లేదు..

ఇద్దరు ఇరానియన్ సిస్టర్స్ టీవీ9 ఎదుట తమ గోడును వెళ్ళబోశారు. ‘‘డి ఫార్మసీ చదివేందుకు ఇక్కడికి వచ్చాం.. మా ఇద్దరికీ ముగ్గురు చిన్న పిల్లలు..ఇరాన్ లో యుద్ధ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజులుగా మా కుటుంబాలతో కమ్యూనికేషన్ లేదు. వాళ్లు ఎలా ఉన్నారో ఏమయ్యారో కూడా అర్థం కావడం లేదు. మేం వారిపైనే ఆధారపడి ఇక్కడ ఉంటున్నాం. అక్కడ యుద్ధ పరిస్థితుల తర్వాత ఇక్కడ మా పరిస్థితి దయానియంగా మారింది. మరో రెండు నెలల్లోనే మా కోర్సు పూర్తికాగానే ఇరాన్ వెళ్ళిపోవాలనుకున్నాం. ఇంతలో యుద్ధంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల క్రితం వరకు కుటుంబంతో కమ్యూనికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారో ఏమయ్యారో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ సాధారణ జీవనానికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఇక్కడ మాకు ఎవరూ లేరు.. ఉన్న డబ్బు కూడా పూర్తిగా అయిపోయింది. ఇంటి అద్దె రెండు నెలలు చెల్లించాలి.. పిల్లల స్కూలు ఫీజు కూడా భారంగా మారింది. పిల్లలతో వారి పోషణ కూడా కష్టంగా ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్నాం.. ప్రభుత్వం ఆదుకోవాలి. భారత ప్రభుత్వం సాయం చేస్తుందని నమ్మకంతో ఉన్నాం..’’ అని ఆవేదనతో అన్నారు జీనాబ్..

వీడియో చూడండి..

వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాం..

ముగ్గురు పిల్లలు పీఎం పాలెం లోని ఓ స్కూల్లో చదువుతున్నారు. రెండు నెలలుగా ఆర్థిక భారంతో పిల్లల ఫీజులు చెల్లించడం కూడా వారికి కష్టతరంగా మారింది. ప్రస్తుతం వారి దయనీయ పరిస్థితిని చూసి పెద్ద మనసు చాటుకున్నారు స్కూలు నిర్వాహకులు. అతిథిగా మన దేశానికి వచ్చిన వారిని.. మానవత్వంతో నైతిక మద్దతు నిచ్చేలా పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ‘ మా దగ్గరే పిల్లలు చదువుతున్నారు.. ఏనాడూ ఫీజులను వాళ్ళు చెల్లించకుండా ఉండలేదు.. ఈ మధ్యయుద్ధ పరిస్థితులలో వాళ్లు కష్టాల్లో పడ్డారు.. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాం. ఈ సమయంలో వారికి మానవత్వంతో అందరూ సహకారం అందించాల్సిన అవసరం ఉంది.’ అని పెద్ద మనసుతో అన్నారు పాఠశాల ప్రిన్సిపల్ అనుపమ..

అధికారుల నుంచి భరోసా..

బాధిత మహిళల ఇబ్బందుల్ని కలెక్టర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు అధికారులు. ఇరానియన్ సిస్టర్స్ నివాసముంటున్న ఇంటి యజమాని, చదువుతున్న విద్యాసంస్థ డైరెక్టర్ తో మాట్లాడి తగిన సహకారం అందించాలని సూచించారు. వీలైనంత వరకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు..