
హైదరాబాద్, ఏప్రిల్ 9: ఏప్రిల్ నెలారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది.
నిన్న బుధవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 41.6 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 41.5 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నేరడుగొమ్మలో 41.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 41.4 డిగ్రీలు, జనగామ జిల్లా పాలకుర్తిలో 41.2 డిగ్రీలు, వరంగల్ జిల్లా సంగెంలో 41.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించింది. గురువారం కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఏపీలో వాతావరణం ఇలా..
అటు ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణం చోటు చేసుకుంటుంది. మధ్యాహ్నం వరకు ఎంత తీక్షణంగా ఉంటుంది. సాయంత్రం నాటికి వానలు కురుస్తున్నాయి. బుధవారం తూర్పుగోదావరిలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. బుధవారం పల్నాడులో 42.2 డిగ్రీలు, చిత్తూరులో 42.1డిగ్రీలు, నంద్యాలలో 41.9డిగ్రీలు, కడపలో 41.8 డిగ్రీలు, అనంతపురంలో 41.7 డిగ్రీలు, కర్నూలులో 41.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలో 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.