Reading Time: < 1 minute
Nabeel Gabol Distances Himself From Dhurandhar 2 Character Amid Controversy

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు నబీల్ గబోల్ ఇప్పుడు ఒక వింతైన చిక్కుల్లో పడిపోయారు, మొన్నటి వరకు ఒక సినిమా పాత్రను తనదేనని గర్వంగా చెప్పుకున్న ఈ రాజకీయ నాయకుడు, ఇప్పుడు అదే పాత్ర తనది కాదని చెబుతూనే మరోపక్క హడలిపోతున్నారు. దీనికంతటికీ కారణం ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’. ‘ధురంధర్’ మొదటి భాగం విడుదలైనప్పుడు, అందులోని క్యారెక్టర్ ‘జమీల్ జమాలీ’ తన జీవితం ఆధారంగానే రూపొందించబడిందని నబీల్ గబోల్ గట్టిగా ప్రచారం చేసుకున్నారు. టీవీ ఇంటర్వ్యూలలో కూడా చాలా సిగ్గుపడుతూ.. “అవును, జనం ఇప్పుడు నన్ను నబీల్ అని కాకుండా జమీల్ జమాలీ అని పిలుస్తున్నారు” అంటూ తెగ మురిసిపోయారు. తన పాపులారిటీ పెరిగిందని భావించిన ఆయన, ఆ సినిమా సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు.

Also Read : Sundeep Kishan: సందీప్ కిషన్‌తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా

అయితే, తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’ చూశాక నబీల్ గబోల్ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఈ సీక్వెల్‌లో జమీల్ జమాలీ పాత్రకు సంబంధించిన కొన్ని చీకటి కోణాలు, నెగటివ్ షేడ్స్ బయటకు రావడంతో ఆయనలో వణుకు మొదలైంది. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా.. “ఆ సినిమాకు నాకు అసలు సంబంధమే లేదు.. జమీల్ జమాలీ పాత్ర నాది కానే కాదు” అంటూ మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో ఉన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా, నబీల్ గబోల్ భయం వెనుక బలమైన కారణమే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమా పాత్ర తనదేనని ఆయన గతంలో ఒప్పుకోవడంతో, ఇప్పుడు పాక్ ఆర్మీ మరియు అక్కడి నిఘా సంస్థలు ఆయనపై కన్నేసినా కన్నేయచ్చని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఆయనను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మొత్తానికి, ఒక సినిమా పాత్రను క్రెడిట్ కోసం తనదిగా చెప్పుకుని, ఇప్పుడు అదే పాత్ర వల్ల తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు నబీల్ గబోల్.