Reading Time: 2 minutes
T Jeevan Reddy Resignation Congress Joining Brs News

Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. హస్తం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పార్టీ అధిష్టానం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని, సముచిత స్థానం కల్పించడంలో అధిష్టానం విఫలమైందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట కొనసాగడం కంటే బయటకు రావడమే మేలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

RRR Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.!

జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి, తన అనుచరులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకోవాలని ఆయన యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయకుండా దూరంగా ఉండటం, ఈ మార్పుకు బలమైన సంకేతంగా కనిపిస్తోంది.

viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!

జీవన్ రెడ్డి అసంతృప్తిపై కాంగ్రెస్ అధిష్టానం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఆయనకు పార్టీలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే , ఎంపీ టికెట్లు ఇచ్చి అన్ని విధాలా గౌరవించామని, అయినప్పటికీ ఆయన పలుమార్లు పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల అధిష్టానం కూడా ఆయన విషయంలో కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వెళ్ళిపోయినా పెద్దగా నష్టం లేదనే ‘వేచి చూసే ధోరణి’ని కాంగ్రెస్ అవలంబిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డికి దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన గనుక పార్టీని వీడితే జగిత్యాల , చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కొంత మేర ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏదేమైనా, ఉగాది పండుగ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని స్పష్టమవుతోంది.