Reading Time: 2 minutes
India Playing Xi Vs New Zealand Final Kuldeep Likely In Varun Chakravarthy Out

IND Playing XI vs NZ for T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో భారత్–న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఫైనల్‌కు ముందు భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. కీలక మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పులో ఓ మార్పు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వరుణ్ చక్రవర్తి అవుట్:
భారత జట్టు స్పిన్ విభాగంలో మార్పు జరిగే అవకాశం ఉందని సమాచారం. న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడడం లేదని తెలుస్తోంది. అతడి స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోందట. గత కొన్ని మ్యాచ్‌లలో వరుణ్ ఎక్కువ పరుగులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మార్పు చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులిచ్చాడు. అంతకుముందు కూడా భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుణ్‌ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని కెప్టెన్, కోచ్ చూస్తున్నారట. మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై మాత్రమే కుల్దీప్ ఆడిన విషయం తెలిసిందే.

అభిషేక్ శర్మకు మరో అవకాశం:
టీ20 వరల్డ్ కప్ 2026లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అయినా ఫైనల్ మ్యాచ్‌లో అతడికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జట్టు మేనేజ్‌మెంట్ అతనిపై విశ్వాసం ఉంచి కీలక మ్యాచ్‌లో కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారన్నా మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో రింకు సింగ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లు ఆడే అవకాశం లేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లు బెంచ్‌పైనే ఉండనున్నారు. న్యూజిలాండ్‌తో జరిగే ఈ కీలక ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా అత్యంత సమతుల్య జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.

భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.