July 9, 2026

Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!

Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!
Reading Time: 2 minutes
Jasprit Bumrah Success Story Coach Kishore Trivedi Ahmedabad

Jasprit Bumrah: ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా గురువారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది. 253 పరుగుల భారీ స్కోరు సాధించినా, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ (105 రన్స్) వీరోచిత పోరాటంతో ఒక దశలో టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్ జారిపోతుందేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. డెత్ ఓవర్లలో బుమ్రా తన అసాధారణ నియంత్రణతో ఆఖరి రెండు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ వేగానికి బ్రేకులు వేశాడు. భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. “బుమ్రా వంటి ప్రతిభావంతులు తరానికి ఒక్కరే పుడతారు” అని కొనియాడారు. కానీ, ఇంతటి మహోన్నత బౌలర్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆ గురువు ఎవరు? ఆయన కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్

అహ్మదాబాద్‌లోని ఆ చిన్న మైదానం..
అహ్మదాబాద్‌లోని ఒక సాధారణ క్రికెట్ మైదానంలో 79 ఏళ్ల కిషోర్ త్రివేది నేటికీ ‘రాయల్ క్రికెట్ అకాడమీ’ని నడుపుతున్నారు. ఆయన కుమారుడు సిద్ధార్థ్ త్రివేది రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ ఆడినప్పటికీ, కిషోర్ త్రివేది క్రికెట్ ప్రపంచానికి అందించిన అతిగొప్ప బహుమతి మాత్రం జస్ప్రీత్ బుమ్రానే. 16 ఏళ్ల వయసులో బుమ్రా మొదటిసారి కోచ్ త్రివేదిని కలిశాడు. అప్పుడు బుమ్రా చాలా సన్నగా ఉండేవాడు, అతని బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉండేది. చాలా మంది ఆ యాక్షన్‌ను మార్చాలని సలహా ఇచ్చారు, కానీ త్రివేది మాత్రం బుమ్రాలోని విభిన్నతను గుర్తించారు. బుమ్రా చేతికున్న ‘హైపర్ ఎక్స్‌టెన్షన్’ వల్ల బంతి విభిన్న కోణంలో విడుదలవుతుందని, అది బ్యాటర్లకు అర్థం చేసుకోవడం కష్టమని ఆయన గ్రహించారు.

క్రమశిక్షణతో కూడిన శిక్షణ..
ఆరంభంలో బుమ్రా క్రికెట్ పట్ల అంత సీరియస్‌గా ఉండేవాడు కాదని, ప్రాక్టీస్‌కు కూడా సరిగ్గా వచ్చేవాడు కాదని అతని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో త్రివేది ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా తల్లి దల్జీత్‌తో మాట్లాడి, కొన్నాళ్ల పాటు తన కొడుకు బాధ్యతను తనకు వదిలేయమని కోరారు. ఒకవేళ బుమ్రా ప్రాక్టీస్‌కు గైర్హాజరైతే, మరుసటి రోజు రోజంతా నెట్స్ వెనకాలే నిలబడేలా శిక్ష వేసేవారు. ఇలా బుమ్రాను ఒక క్రమశిక్షణ గల ఆటగాడిగా తీర్చిదిద్దారు. చాలామంది బుమ్రా యాక్షన్‌ను చూసి ‘చక్కర్’ (అక్రమ యాక్షన్) అని ఎగతాళి చేసినా, త్రివేది మాత్రం బుమ్రాకు అండగా నిలిచి, ఆ యాక్షన్‌ను మార్చవద్దని భరోసా ఇచ్చారు. అదే ఈరోజు బుమ్రాకు బలంగా మారింది. కేవలం వేగం మాత్రమే సరిపోదని, యార్కర్లు, కట్టర్లు, స్లో బాల్స్‌తో బ్యాటర్ మనసును చదవడం బుమ్రాకు నేర్పించారు త్రివేది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసిన తీరు దీనికి నిదర్శనం. సెంచరీతో చెలరేగిన బెథెల్ కూడా బుమ్రా వేసిన 13 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగారంటే, బుమ్రా తెలివైన బౌలింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గుజరాత్ తరపున ఆడుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ స్కౌట్ జాన్ రైట్ కంట పడటంతో బుమ్రా దశ తిరిగింది. నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. తన అకాడమీ బ్యానర్‌పై “జస్ప్రీత్ బుమ్రా – ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు” అని త్రివేది గర్వంగా రాసుకున్నారు. “ఒక చిన్న సెంటర్ నుంచి ప్రపంచ స్థాయి బౌలర్ రావడం కంటే సంతోషం ఏముంటుంది?” అని మురిసిపోతుంటారు. అయితే, ఆయన మనసులో ఒకే ఒక చిన్న కోరిక ఉంది.. “బుమ్రా అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి వెళ్తుంటే బాగుంటుంది” అని ఆయన ఆశిస్తున్నారు. ఒక గురువుకు తన శిష్యుడి విజయం కంటే పెద్ద బహుమతి ఏముంటుంది.

READ ALSO: T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నామినేట్..