
Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు శనివారం నాటి దాడులతో పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై భారీ దాడులు ప్రారంభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలకు ఒక అసాధారణ పిలుపునిచ్చారు. “మీ ప్రభుత్వాన్ని మీరే చేతుల్లోకి తీసుకోండి” అని ఆయన కోరడం, ఇరాన్‌లోని ప్రస్తుత మతపరమైన పాలనను అంతం చేయడమే మిత్రదేశాల లక్ష్యమా అనే సంకేతాలను ఇస్తోంది. ఈ దాడిలో మొదటి లక్ష్యం ఇరాన్ సుప్రీం లీడర్, 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసం ఉండే కాంపౌండ్‌గా తెలుస్తోంది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంపై దాడులు జరిగిన సమయంలో ఆయన అక్కడ ఉన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. రాజధాని టెహ్రాన్ నగరమంతటా దట్టమైన పొగ కమ్ముకుంది. ఇరాన్‌లోని ఉత్తర నగరమైన తబ్రిజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దీంతో 36 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తుంది.