Reading Time: < 1 minute

దళితుల భూముల్లో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ కట్టుకుండు: మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఫైర్

Caption of Image.
  • అమరవీరుల కుటుంబసభ్యులతో కలిసి గన్ పార్కు వద్ద నివాళులు

హైదరాబాద్, వెలుగు: పేదలకు ఇందిరా గాంధీ ఇచ్చిన అసైన్డ్ భూములను సీఎం హోదాలో కేసీఆర్ కబ్జాచేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడిందన్నారు. తెలంగాణ అమరవీరులకు ఎర్రవల్లిలో ప్రత్యేక కాలనీ నిర్మించి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి రాములు నాయక్ నివాళులు అర్పించారు.

అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం వారితో కలిసి రాములు నాయక్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కబ్జా చేసిన అసైన్డ్ భూములను రేవంత్ గుర్తించి ఆ భూమిలో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మిస్తానని ప్రకటించడం తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు, గౌరవం అని అన్నారు.

వచ్చే ఏడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల కుటుంబ సభ్యులు ఆ కాలనీలో గృహ ప్రవేశాలు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ఆ దిశగా అధికారులు కూడా చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో ఉద్యమకారులు, ఎన్నో సంఘాలు కలిసి పోరాడాయని, చివరకు సాధించుకున్న తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించి ఉద్యమకారులకు, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకొని, దాచుకుందని ధ్వజమెత్తారు.

©️ VIL Media Pvt Ltd.