Reading Time: < 1 minute

ఉరికురికి నోటీసులు.. ఆందోళనలతో వెనక్కి.. సర్ ప్రక్రియ సాగిందిలా..!

Caption of Image.

సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నో–మ్యాపింగ్, ఇంటి పేరు లేదా పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు, పుట్టిన తేదీల్లో స్వల్ప వ్యత్యాసాల పేరుతో 92.88 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో సరైన విచారణ లేకుండానే సాఫ్ట్‌‌వేర్ ఆధారంగా అనామలీస్ జాబితాలో చేర్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణ ప్రజలు, వృద్ధులు, కూలీలు ఓటు హక్కును కాపాడుకునేందుకు పనులు మానుకుని ఈఆర్‌‌వో కార్యాలయాలు, హియరింగ్ క్యాంపుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

గత నెల 23 నాటికి 40 రోజుల హియరింగ్ తర్వాత కేవలం 30 లక్షల మందినే అర్హులుగా తేల్చడంతో మిగిలిన వారి ఓట్లు రద్దవుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, అసలైన ఓటర్లను జాబితా నుంచి తప్పిస్తున్నారని ప్రతిపక్షాలు, సీజేపీ ప్రతినిధులు భగ్గుమన్నారు.

ఈసీ ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలతో ఈసీ తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయి, రాజకీయ దుమారం నుంచి బయటపడేందుకు నిబంధనలు సడలించినట్లు విమర్శలు వచ్చాయి. వారం, పది రోజుల కిందటి వరకు ఉన్న ప్రతి ఓటరు వ్యక్తిగతంగా ఈఆర్‌‌వో కేంద్రం లేదా హియరింగ్ క్యాంపునకు హాజరు కావాలన్న నిబంధనను ఎత్తేసింది.

స్వల్ప తప్పులకు పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాల కొర్రీలను పక్కనబెట్టి, కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండానే ఉన్నచోటు నుంచే సమస్య పరిష్కరించుకునే అవకాశం ఇచ్చింది. ‘వీలైనంత వరకు అందరినీ ఓకే చేయండి.. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు’ అంటూ ఈసీ ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి అంతర్గత ఆదేశాలు వెళ్లినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

©️ VIL Media Pvt Ltd.