
న్యూ ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ పోలీసుల ద్వారా రాచరిక పాలన సాగిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి మండిపడ్డారు. ప్రజల తరఫున వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, 13 కోట్ల ఓట్ల తొలగింపునకు నిరసనగా 6, 7, 8 తేదీల్లో విసృత ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఇందులో భాగంగానే 6న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలందరం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి మార్చ్ నిర్వహించాలని భావిస్తే పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని చెప్పారు. అనేక చోట్ల పోలీసులు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతోపాటు ఇతర ఎంపీల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.
రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం: ఎంపీ చామల
దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రధానులెవరూ ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీయలేదని ఆయన గుర్తుచేశారు. బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లకుండా రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సమావేశమవుతున్నామని తెలిపారు.