పక్షవాతం కొందరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. కోలుకోవడానికి నెలలు పడుతుంది, కొందరు మంచానికే పరిమితమవుతారు. అయితే, కొంతమందిలో పక్షవాతం యొక్క హెచ్చరికగా ఒక తేలికపాటి స్ట్రోక్ వస్తుంది. దీనినే మినీ బ్రెయిన్ స్ట్రోక్ లేదా ట్రాన్సెంట్ ఇషీమిక్ ఎటాక్ (TIA) అంటారు. దీని లక్షణాలు సాధారణంగా 24 గంటల్లో తగ్గిపోతాయి, కానీ ఇది ప్రధాన పక్షవాతం రాబోతుందనడానికి స్పష్టమైన సంకేతం. ఇలాంటి వారికి ఆరు నెలల్లోగా మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు
మెదడులో రక్తనాళాలు ఉంటాయి, ఇవి మెదడు కణాలకు పోషకాలను, ఆక్సిజన్‌ను, నీటిని చేరవేస్తాయి. ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఇంకా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అడ్డుపడితే, ఆ భాగం నుంచి దిగువకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఆక్సిజన్ అందక మెదడు కణాలు ప్రభావితమవుతాయి, దీనివల్ల మినీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కొన్నిసార్లు శరీరంలో ఎక్కడైనా ఏర్పడిన రక్తపు గడ్డలు మెదడులోని సూక్ష్మ రక్తనాళాలకు చేరుకుని అడ్డుపడవచ్చు.
మినీ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు: లక్షణాలు త్వరగా కనిపించి, 24 గంటల్లో తగ్గిపోతాయి. వాటిలో కొన్ని .. మాట తడబడటం, మాట ముద్దగా మారడం (బ్లర్), తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరిగి స్పృహ తప్పడం లేదా పడిపోవడం, శరీరం ఒక వైపు మొద్దుబారినట్లు అనిపించడం, చేయి, కాలు కదపలేకపోవడం, నరాలు పట్టివ్వనట్లు అనిపించడం, కాళ్లు చేతులు నియంత్రణలో లేకపోవడం, ఒక వైపు శరీరం గుంజినట్లు అనిపించడం, కళ్ళు తేడాగా అనిపించడం, దృష్టిలో మార్పులు, నడుస్తుంటే బ్యాలెన్స్ కోల్పోవడం, పడిపోతామనే భయం.
అధిక రక్తపోటు (హై బీపీ): బీపీ అదుపులో లేని వారికి మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినే లేదా పగిలిపోయే ప్రమాదం ఉంది. బీపీకి మందులు వాడుతున్నప్పటికీ, చాలా మందిలో బీపీ నియంత్రణలో ఉండదు. స్ట్రెస్, టెన్షన్ వంటివి బీపీని మరింత పెంచి మినీ బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీయవచ్చు. రక్తనాళాల గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడికలు ఏర్పడతాయి, ఇవి రక్త ప్రవాహానికి అవరోధం కలిగిస్తాయి. హృదయంలో కొలెస్ట్రాల్ పేరుకుంటే హార్ట్ ఎటాక్, మెదడులో పేరుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా డయాబెటిస్ నియంత్రణలో లేని వారికి కూడా ప్రమాదం ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్ ఫార్మేషన్‌ను పెంచి, రక్తనాళాల్లో మంటను (ఇన్ఫ్లమేషన్) కలిగిస్తుంది.
ఉప్పు ఎక్కువగా తినడం, నిల్వ పచ్చళ్ళు, ఉప్పులో ఊరబెట్టిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం చిక్కబడి, రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. మినీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి జీవనశైలి మార్పులు చాలా అవసరంలో ఉప్పును పూర్తిగా తగ్గించడం వల్ల రక్తం పల్చబడి, రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. అన్నం బదులు పుల్కాలు తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్లను తగ్గించి, ఫైబర్ డైట్‌ను పెంచాలి. రాత్రి భోజనంలో బాదం, పిస్తా, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి ఒమేగా ఫ్యాట్స్ కలిగిన నట్స్‌ను నానబెట్టుకుని, పండ్లతో పాటు తీసుకోవడం మంచిది.




