తిరుమల కొండపై పాముల సందడి కొనసాగుతోంది. విష సర్పాల అలికిడి భయపెడుతోంది.జీవవైవిద్యం ఉట్టిపడే శేషాచలం కొండలు జీవరాశులకు నిలయం కాగా ఎన్నో సర్పజాతులు సేద తీరుతున్నాయి.దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సురక్షితమైన ఆవాసంగా మార్చుకున్న పాములు అప్పుడప్పుడు బయటకు వచ్చి సందడి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల వెంకన్న కొలువైన సప్తగిరుల్లోని సర్పాలు బయట కనిపిస్తూ భక్తులను భయపెడుతున్నాయి.
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న జర్రిపోతులు నాగుపాములు, కొండచిలువలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అలజడి చేస్తున్నాయి. ఆదిశేషుడిని వాహనంగా చేసుకుని బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చే మలయప్ప స్వామి కొలువైన చోట పాములు సందడి చేస్తుండటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.
తిరుమలలో నడక మార్గాల్లోనే కాకుండా తిరుమలలో అతిథి గృహాలు, రింగు రోడ్లు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో కంట పడుతున్న పాములు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.చల్లని ప్రాంతాల్లో సేద తీరే ప్రయత్నం చేస్తున్న పాములు ఇలా బయటకు వస్తుండగా భక్తుల్లో ఆందోళన నెలకొంది.
ఇందులో భాగం గానే తిరుమల రింగ్ రోడ్ లో 7 అడుగుల పొడవైన జర్రిపోతు భక్తుల కంటపడింది. రింగ్ రోడ్ లో జర్రిపోతు ను గమనించి అప్రమత్తమైన భక్తులు సిబ్బంది వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగి గా పనిచేస్తున్న భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకున్నారు.
7 అడుగుల మేర ఉన్న జెర్రిపోతు ను చాకచక్యంగా బంధించాడు. సేఫ్ గా జర్రిపోతును శేషాచలం కొండల్లో వదిలి పెట్టాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకోగా ఆర్ బి సి సెంటర్ వద్ద కూడా నాగుపాము అలికిడి చేసింది. షెడ్డులోకి వెళ్లి అలికిడి చేసిన నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది. నాగు పామును చాకచక్యంగా బంధించిన భాస్కర్ నాయుడు శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.




