
అత్యాచారం కేసులో కరీంనగర్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2026 అక్టోబర్ 9న వెలువరించిన తీర్పులో మహిళతో సహా నలుగురికి శిక్ష విధించింది కోర్టు.
అదే విధంగా ఒక్కొక్కరికి రూ.11 వేల చొప్పున జరిమానా విధించింది. సామూహిక అత్యాచారం కేసు విచారించిన కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నీరజ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
2017 మార్చి 10న కాట్నపల్లి శివారులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత మహిళను నమ్మించి తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డారు నిందితులు. గుండబోయిన శంకర్, న్యాతరి స్వామి, సంజయ్ కుమార్ యాదవ్‌లతో పాటు.. నేరానికి సహకరించిన మహిళ షేక్ సఖియా బేగం అలియాస్ పద్మకు కూడా జైలు శిక్ష విధించారు జడ్జీ.
అప్పట్లో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో గ్యాంగ్ రేప్, అట్రాసిటీ కేసు నమోదైంది. అప్పటి పెద్దపల్లి ఏసీపీలు సింధు శర్మ, హబీబ్ ఖాన్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించింది.