
ఎల్ నినో ప్రభావంతో ముంచుకొస్తు్న్న సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు , పరిమితమైన నీటి వనరులు ఉపయోగించి పంటలు సాగు చేసే విధానాలను తెలుసుకునేందుకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలోని తెలంగాణ బృందం సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తోంది. అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ రైతులకు ఉపయోగపడే పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలపై దృష్టి సారించనున్నారు. అసలు సౌత్ ఆఫ్రికాలో రైతులు అనుసరిస్తున్న సాంకేతికత ఏంటి..? తక్కువ నీటితో లాభసాటి వ్యవసాయం ఎలా చేస్తున్నారు..? ఆ వివరాలు తెలుసుకున్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్ భవాని రెడ్డి, మంత్రి సీతక్క.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా ముందుకెళ్తోంది సౌత్ ఆఫ్రికా. పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ లాభసాటి వ్యవసాయానికి అక్కడి రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటల సాగుతో పాటు ఆధునిక యంత్రాలు, నూతన సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. మొక్కజొన్నతో పాటు వివిధ రకాల కూరగాయలు, పండ్లు, నట్స్ సాగులోనూ ముందున్నారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాలో అమలు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లింది తెలంగాణ బృందం.