Reading Time: 2 minutes

‘పీఆర్టీ’తో ట్రాఫిక్ కు చెక్..భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ప్రజా రవాణా: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.
  •     ఏడాదిలోనే నాగార్జున సర్కిల్-జూబ్లీ చెక్ పోస్టు ఫ్లైఓవర్ 
  •     ‘క్యూర్’ పనులపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ప్రజారవాణా మెరుగుదల, రోడ్ల అనుసంధానం, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై శుక్రవారం రాత్రి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహానగరంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ నెలకొన్న ప్రధాన ప్రాంతాల్లో ‘పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్’ (పీఆర్టీ) సిస్టమ్‌‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. పరిశ్రమల కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా రాకపోకలు సాగించే కీలక మార్గాలను మెట్రో, ఎంఎంటీఎస్, ప్రధాన బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ రూట్లను డిజైన్ చేయాలని స్పష్టం చేశారు.

కేబీఆర్ పార్కు చుట్టూ సాఫీగా రాకపోకలు సాగేలా ప్లాన్

కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన వన్ వే విధానంతో వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పరిసర కాలనీల నుంచి వచ్చే రోడ్లు కలిసే జంక్షన్లు, ఫ్రీ లెఫ్ట్‌‌లు, యూటర్న్‌‌ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిగ్నలింగ్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు వరకు తలపెట్టిన ఫ్లైఓవర్ పనులను ముంబై తరహాలో సరికొత్త సాంకేతికతను జోడించి ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. గ్రేటర్ శివార్లలో కనెక్టివిటీని పెంచేందుకు శంకర్‌‌పల్లి–చేవెళ్ల మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్ల విస్తరణతో పాటు కొత్త రోడ్ల నిర్మాణ అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

పారిశ్రామిక అవసరాలకు 500 ఎంఎల్​డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగం

నగరంలో నీటి కొరత రాకుండా వ్యర్థ జలాల పునర్వినియోగానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపు 500 ఎంఎల్​డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి రూపొందించిన ప్రణాళికలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌‌వల్లి, ఆలూరు క్లస్టర్లలోని భారీ డేటా సెంటర్లు, పారిశ్రామిక అవసరాలకు ఈ రీసైకిల్డ్ వాటర్‌‌ను సమర్థవంతంగా సరఫరా చేయాలన్నారు. కొత్త కార్పొరేషన్ల కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించిన ఈ భేటీలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, మెట్రో సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, అధికారులు కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.