ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అలసట, నీరసం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రోజంతా నీరసంగా అనిపించడం, ఏ పని చేయాలన్నా శక్తి లేకపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అయితే, ఈ సమస్యలకు ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే రాగిపిండి డ్రింక్. రోజుకు కేవలం ఒక గ్లాసు ఈ పానీయం తాగడం వలన ఒంట్లో నీరసం అంతా పోయి, శరీరానికి కావలసిన శక్తి రెట్టింపు అవుతుంది. ఈ డ్రింక్ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది.
ముందుగా ఒక గిన్నెలో పది బాదం పప్పులను తీసుకొని, వాటిలో వేడి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. మరో గిన్నెలో రెండు స్పూన్ల రాగిపిండిని తీసుకొని, కొద్దిగా నీటిని కలిపి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.
నీళ్లు బాగా మరిగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న రాగిపిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసి, ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సమయంలో మిశ్రమం చిక్కబడుతుంది.
మిశ్రమం చిక్కబడిన తర్వాత, అందులో రెండు స్పూన్ల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. కావాలంటే, బెల్లం బదులు తాటి బెల్లం లేదా ఖర్జూర పండ్లను కూడా ఉపయోగించవచ్చు. బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి.
నానబెట్టిన బాదంపప్పుల పొట్టు తీసి, కొద్దిగా నీటితో మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్‌ను రాగి జావలోకి వేసి, ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మంచి సువాసన కోసం చిటికెడు యాలకుల పొడిని కూడా చేర్చుకోవాలి. ఇదంతా బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే రాగి డ్రింక్ సిద్ధం అవుతుంది.
ఈ రాగి పిండిలో ఇది ఐరన్, కాల్షియంలకు గొప్ప మూలం. రక్తహీనత సమస్యను తగ్గించి, ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు, పెద్దవారిలో ఎముకల ఆరోగ్యానికి రాగి ఎంతో అవసరం. బాదంపప్పులు ప్రోటీన్, విటమిన్ ఇ, మంచి కొవ్వులు (గుడ్ ఫ్యాట్స్) అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచివి.




