
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ధూలే జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న జంట తాపీ నదిలో శవాలుగా తేలారు. కాళ్లను ఇనుప గొలుసుతో కట్టి.. తాళం వేసి ఉండటం కలకలం రేపుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నదిలో లభించిన మృతదేహాలు శ్యామ్ హరి పాటిల్, స్వప్న పాటిల్‌గా గుర్తించారు. వీరిద్దరూ జల్గావ్ జిల్లాలోని అమల్నేర్ తాలూకాకు చెందినవారు. కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ధూలే జిల్లాలోని సావల్దే ప్రాంతంలో తాపీ నది అడుగున వారి మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల కాళ్లను ఇనుప గొలుసుతో కట్టి, దానికి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలకు గొలుసులు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారి.. మృతదేహాలు నది అడుగున లభించాయని.. కాళ్లకు ఇనుప గొలుసు వేసి తాళం పెట్టి ఉన్నట్లు తెలిపారు. ఇది ఆత్మహత్యా, హత్యా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.