
AB de Villiers 37-Ball Century: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మళ్లీ తన పాత రోజులను గుర్తుకు తెస్తూ విశ్వరూపం ప్రదర్శించాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాది, మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఎనిమిదేళ్లకు పైగా అవుతున్నా, ఐపీఎల్‌లో చివరిసారిగా 2021లో ఆడినా, అతని బ్యాటింగ్‌లోని జోరు ఏమాత్రం తగ్గలేదని ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం డివిలియర్స్ వయసు 42 సంవత్సరాలు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు.. డార్సీ షార్ట్, డేవిడ్ వార్నర్, జో బర్న్స్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అయితే, 210 పరుగుల టార్గెట్‌ను డివిలియర్స్ ఊదేశాడు. మూడో నెంబర్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అతను ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికిపారేశాడు. కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 111 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇందులో కేవలం 37 బంతుల్లోనే శతకం పూర్తి చేయడం విశేషం. కవర్స్, లాంగ్-ఆఫ్, లాంగ్-ఆన్, డీప్ మిడ్-వికెట్ మీదుగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ మొత్తంగా 6 ఫోర్లు, 11 భారీ సిక్సర్లు బాదాడు.
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌కు ఓపెనర్ రిచర్డ్ లెవి (29 బంతుల్లో 62 పరుగులు) నుంచి మంచి సహకారం లభించింది. డివిలియర్స్ దెబ్బకు సౌతాఫ్రికా జట్టులో ఫాఫ్ డుప్లెసిస్, జేపీ డుమిని లాంటి దిగ్గజ బ్యాటర్లు కూడా క్రీజులో ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండానే మ్యాచ్ ముగిసింది. సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. డివిలియర్స్ ఈ లీగ్‌లో అదరగొట్టడం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది జరిగిన 2025 ఎడిషన్‌లోనూ కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 429 పరుగులు చేసి, 220 స్ట్రైక్ రేట్‌తో టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో అతను మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. రీసెంట్‌గా విరాట్ కోహ్లీ తన 37 ఏళ్ల వయసులో కెరీర్ పీక్‌లో ఉన్నాడని డివిలియర్స్ మాట్లాడిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో, 42 ఏళ్ల వయసులోనూ ఏబీ డివిలియర్స్ తాను ఎప్పటికీ ‘మిస్టర్ 360’ నేనని మరోసారి నిరూపించి క్రికెట్ అభిమానులను అలరించాడు.