Reading Time: < 1 minute

తిరుమలలో ఆపరేషన్ వజ్రపహార్ నాకాబందీ… ఆరుగురు అరెస్ట్.. 4 వాహనాలు స్వాధీనం…

Caption of Image.

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతను పటిష్టం చేసేందుకు ఆపరేషన్ వజ్రపహార్ నాకాబందీ నిర్వహించారు పోలీసులు. శుక్రవారం ( అక్టోబర్ 9 ) పాపవినాశం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. పోలీస్, టీటీడీ విజిలెన్స్, అటవీ, ఫైర్, రెవెన్యూ, బీడీ టీమ్స్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ తదితర 10 విభాగాలకు చెందిన సుమారు 52 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాపవినాశనం వద్ద 108 షాపులను తనిఖీ చేసి, సరైన గుర్తింపు కార్డులు లేని 6 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు లేని 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న 21 షాపులను గుర్తించారు. 24 మంది అనుమానితుల వేలిముద్రలను పరిశీలించారు.

షాపులు, హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, గుర్తింపు కార్డులు, లైసెన్సులను తనిఖీ చేయడంతో పాటు, టీటీడీ, ఫారెస్ట్ నిబంధనలకు అనుగుణంగా షాపులు నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు తదితర నిషేధిత వస్తువులను తీసుకురావడం లేదా వినియోగించడంపై హెచ్చరించారు.

ALSO READ : ట్యాంక్‌బండ్‌ పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు..!

అపరిచితులకు షాపులను అద్దెకు ఇవ్వకూడదని, సరైన గుర్తింపు లేకుండా ఎవరినీ పనిలో నియమించుకోవద్దని స్థానిక వ్యాపారులకు సూచించారు. తిరుమల పవిత్రత, భక్తుల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రోడ్డు భద్రత, డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యాలను స్థానిక యువతకు వివరించి అవగాహన కల్పించారు. 

అత్యవసర పరిస్థితుల్లో 112, అటవీ సంబంధిత సమాచారం కోసం 1972కు సమాచారం అందించాలని సూచించారు.భక్తుల భద్రత, తిరుమల పవిత్రత పరిరక్షణే లక్ష్యంగా భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.