Reading Time: 2 minutes
Rahul Gandhi Chennai Visit Today Pm Modi To Visit Tomorrow

Rahul Gandhi and PM Modi: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరి మధ్య మధ్యాహ్న భోజన సమయంలో సమావేశం జరిగే అవకాశముందని సమాచారం. టీవీకే–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి
చెన్నై ఐలాండ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘విద్యార్థుల గొంతుక’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి చర్చించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. నీట్ పరీక్ష, పేపర్ లీకేజీలు, విద్యా ఫీజుల పెంపు వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల అభిప్రాయాలు, విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లపై ఆయన చర్చించనున్నారు. సీఎం విజయ్‌తో భేటీ, విద్యార్థుల కార్యక్రమం ఒకే రోజు ఉండటంతో రాహుల్ పర్యటన తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రేపు చెన్నైకి ప్రధాని మోదీ
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ రేపు (అక్టోబర్ 11) చెన్నైలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఉదయం 10.55 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో చెన్నై మెట్రో రెండో దశలోని పూందమల్లి – వడపళని మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం పూందమల్లి నుంచి పోరూరు వరకు మెట్రో రైలులో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం విజయ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇళయరాజా సంగీత కేంద్రం ప్రారంభం
మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు చెన్నై ఐఐటీలో స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరుతో ఏర్పాటు చేసిన సంగీత అభ్యాసం, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే రైల్వేలు, జాతీయ రహదారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

కోయంబత్తూరులో రూ.700 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో సుమారు రూ.700 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. దీంతో పాటు పలు రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకానికి సంబంధించిన కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ పర్యటన, మరోవైపు ప్రధాని మోడీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండటంతో చెన్నైలో రాజకీయ, అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలపై అందరి దృష్టి నెలకొంది.