
- మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
- సంగారెడ్డి జిల్లా మనూరు మండల కేంద్రంలో ఘటన
కంగ్టి, వెలుగు: బట్టలు ఉతకడానికెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనూర్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (45), అతడి భార్య కృష్ణ వేణి (38), అతడి తమ్ముడు సంగమేశ్వర్ రెడ్డి (42) ముగ్గురు కలిసి బట్టలు ఉతికేందుకు గ్రామ శివారులోని చెరువుకుంటకు వెళ్లారు.
బట్టలు ఉతుకుతున్న క్రమంలో సంగమేశ్వర్ రెడ్డి కాలు జారి నీటిలోపడిపోయాడు. దీన్ని గమనించిన అన్న, వదిన అతడిని కాపాడే క్రమంలో ఒకరి వెంట ఒకరు నీటిలో పడి మునిగిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులతో కలిసి పోలీసులు గాలింపు చేపట్టారు.
ముగ్గురి మృతదేహాలను బయటికి తీశారు. కాగా, నరసింహారెడ్డి, కృష్ణవేణి దంపతులకు కొడుకు హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు. సంగమేశ్వర్ రెడ్డికి పెండ్లి కాలేదు. పండగ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చౌదర్పల్లిలో యువకుడు..
రేగోడ్ : మెదక్ జిల్లా రేగోడ్ మండలం చౌదర్పల్లి గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. పశువులు కాసే క్రమంలో గేదెలు చెరువులోకి వెళ్లగా, వాటిని తిరిగి ఒడ్డుకు చేర్చేందుకు నీటిలోకి దిగిన ఆలిగే ప్రశాంత్ (25) ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అలిగే నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పోచయ్య తెలిపారు.