Reading Time: < 1 minute
ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. రోగి దుర్మరణం..!

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో చికిత్స కోసం వెళ్తున్న ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. మయూర్‌భంజ్ జిల్లాలోని ఉడాల సబ్‌ డివిజనల్ ఆసుపత్రి వెలుపల గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందబాయి గ్రామానికి చెందిన సుజోష్ బారిక్ (35) తీవ్రమైన రక్త ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం అతడిని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోగికి ఆక్సిజన్ అందించేందుకు డ్రైవర్ సిలిండర్ వాల్వును తెరిచాడు. కొద్దిసేపటికే ఆక్సిజన్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి, సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మంటలు వేగంగా వ్యాపించడంతో అంబులెన్స్‌లో ఉన్న రోగి తీవ్రంగా కాలిపోయాడు. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్న అతడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర కాలిన గాయాల కారణంగా నిమిషాల వ్యవధిలోనే సుజోష్ బారిక్ మరణించాడు. రోగిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా కాలిన గాయాలకు గురయ్యారు. పేలుడు ధాటికి అంబులెన్స్ పైకప్పు ఎగిరిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అంబులెన్స్‌ను ప్రైవేట్ ఆపరేటర్ నుంచి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆక్సిజన్ సిలిండర్ లీకేజీకి గల కారణాలు, అంబులెన్స్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..