Reading Time: < 1 minute

ప్రజాస్వామ్య రక్షణే మా లక్ష్యం..ప్రజల హక్కులు కాపాడటంలో వెనకడుగు వేయను: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్య రక్షణే తమ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదని  స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రిజైన్ కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు, అడ్డంకులు తమ గొంతులను అణచివేయలేవని తెలిపారు. 

ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు చేస్తున్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు. రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం నిలబడేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారని, ఓ ఎంపీగా ఆ బాధ్యత నుంచి తాను ఎన్నటికీ వెనకడుగు వేయనని ఉద్ఘాటించారు. పార్లమెంటు, రోడ్లు, వీధుల్లోనూ ప్రజల పక్షాన నిలబడి పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం కోసం తన గొంతు వినిపిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే తమ పోరాటం చెక్కుచెదరని సంకల్పంతో మునుముందుకు సాగుతుందని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.