
India vs West Indies: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా ఈ నెల 14వ తేదీన భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న 4వ టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్‌కు కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, టికెట్ల అమ్మకాల విషయంలో నెలకొన్న గందరగోళం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫ్యాన్స్‌కు చుక్కెదురవుతుండగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
క్షణాల్లోనే సోల్డ్ ఔట్.. ఫ్యాన్స్ ఆగ్రహం:
అక్టోబర్ 14వ తేదీన జరగనున్న మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు ప్రారంభమైన క్షణాల్లోనే అసలు సమస్య ప్రారంభమైంది. సాయంత్రం 5:30 గంటలకు టికెట్లు రిలీజ్ అవుతాయని ప్రకటించగా.. యాప్ ఓపెన్ చేసి చూసేసరికి అప్పటికే సోల్డ్ ఔట్ (Sold Out) అని చూపించడంతో అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 12 వేల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని హెచ్‌సీఏ (HCA) చెబుతుండటం, మరోవైపు సోల్డ్ అవుట్ అని రావడంతో అసలు ఇంతకీ టికెట్లు ఉన్నాయా? లేదా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.
టికెట్ జీని యాప్‌పై అనుమానాలు:
ఈ టికెట్ల విక్రయాల కోసం టికెట్ జీని (Ticket Genie) యాప్‌ను ఆశ్రయించాల్సిందిగా హెచ్‌సీఏ సూచించింది. అయితే ఈ యాప్ పని తీరుపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇది జెన్యూన్ కాదంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆన్‌లైన్‌లో గంటల తరబడి వేచి చూసినా నిరాశే మిగులుతోందని వాపోతున్నారు. ప్రతిసారీ అంతర్జాతీయ మ్యాచ్‌లు వచ్చినప్పుడు హెచ్‌సీఏ టికెట్ల విషయంలో ఇలాగే వ్యవహరిస్తోందని, హెచ్‌సీఏ (HCA) తీరు మాత్రం మారడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
►ALSO READ | టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న వెస్టిండీస్.. మరోసారి వైభవ్కి నిరాశే.. సంజుతోనే బరిలోకి భారత్
హెచ్‌సీఏ బ్లాక్ మార్కెట్:
టికెట్ల అమ్మకాలపై హెచ్‌సీఏ (HCA) కేవలం అధికారిక ప్రకటనలకే పరిమితమైందని అభిమానులు ఆరోపిస్తున్నారు. హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేషన్ సభ్యులే స్వయంగా బయట టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో మ్యాచ్ జరగనున్నప్పటికీ ఉప్పల్ స్టేడియంలో ఇంకా పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తికాలేదని సమాచారం. బీసీసీఐ ఇస్తున్న కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయని యువ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హెచ్‌సీఏ స్పందించి టికెట్ల లభ్యతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.