
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ప్రీమియం ఫర్నిచర్ తయారీ బ్రాండ్ ‘ఫాబియెన్స్’ తన వ్యాపార విస్తరణలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటును ప్రకటించింది. నగర సమీపంలో రూ.50 కోట్ల పెట్టుబడితో, 1.5 లక్షల చదరపు అడుగుల్లో దీనిని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి నిర్మాణం పూర్తవుతుంది. దీని ద్వారా 100 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎండీ రాజ్ వేణుగోపాల్ తెలిపారు.
ఈ కొత్త ప్లాంట్‌లో ఇటాలియన్, జర్మన్ యంత్రాలతో సోఫాలు, కుర్చీలు వంటి మూవబుల్ ఫర్నిచర్ ఉత్పత్తిని భారీగా పెంచనున్నారు. 2018లో ప్రారంభమైన ఫాబియెన్స్ సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.80 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన తయారీ కేంద్రం ఉంది. ఇందులో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నివాస, వాణిజ్య, హోటళ్ల రంగాలలో ఇప్పటికే 3,500 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.
అమెరికాకు సైతం ఎగుమతులు చేస్తోంది. భారతీయ ఫర్నిచర్ మార్కెట్ విలువ 2026 నాటికి 31.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తమ ఉత్పత్తులను తీర్చిదిద్దడమే లక్ష్యమని సంస్థ డైరెక్టర్లు తెలిపారు.