Reading Time: 2 minutes
Hong Kong Sixes 2026 India Vs Pakistan Match Schedule Pakistan Squad

Hong Kong Sixes 2026: టీమిండియా, పాకిస్థాన్‌ మధ్య మరోసారి బిగ్ ఫైట్ చూడబోతున్నాం. ఈసారి హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్‌లో ఈ రెండు సాంప్రదాయ ప్రత్యర్థులు తలపడనున్నాయి. దీనికోసం పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఏడుగురు సభ్యులతో కూడిన తమ టీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ టోర్నీలో విశేషమేమిటంటే భారత్, పాకిస్థాన్‌ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాంతో టోర్నమెంట్ ప్రారంభ రోజైన అక్టోబర్ 30నే అభిమానులకు అసలైన భారత్-పాక్ క్రికెట్ మజా అందబోతోంది.

ఈ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హాంగ్ కాంగ్‌లోని టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో జరగనుంది. దీనికోసం అబ్బాస్ ఆఫ్రిది నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టు అక్టోబర్ 28నే హాంగ్ కాంగ్‌కు పయనం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న పాకిస్థాన్‌ జట్టులో కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిదితో పాటు అబ్దుల్ సమద్, అహ్మద్ దానియాల్, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఖవాజా నఫే, మహమ్మద్ షెహజాద్, సాద్ మసూద్ ఉన్నారు. అయితే గ్రూప్ స్టేజ్లోనే భారత్ లాంటి బలమైన జట్టు ఎదురుపడటంతో పాకిస్థాన్‌‌కు ఇది కచ్చితంగా సవాలుతో కూడుకున్న విషయమే.

ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌‌లు యూఏఈతో కలిసి గ్రూప్-సిలో ఉన్నాయి. టోర్నీలోని మిగతా గ్రూపులను చూస్తే గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, హాంగ్ కాంగ్… గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, శ్రీలంక.. గ్రూప్-డిలో అఫ్గానిస్తాన్, ఒమన్, సౌత్ ఆఫ్రికాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ అక్టోబర్ 30న ఉదయం 8:05 గంటలకు (భారత కాలమానం ప్రకారం) యూఏఈతో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అదే రోజు ఉదయం 11:45 గంటలకు భారత్‌తో కొట్లాడనుంది. ఇక భారత జట్టు తన రెండో మ్యాచ్‌ను అక్టోబర్ 31న ఉదయం 8:05 గంటలకు యూఏఈతో ఆడుతుంది. గ్రూప్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. అక్కడ చూపించిన ప్రదర్శనను బట్టి కప్, ప్లేట్, బౌల్ అనే విభాగాల్లో జట్లు ముందుకు సాగుతాయి. నవంబర్ 1న మధ్యాహ్నం 12:40 గంటలకు గ్రాండ్ ఫైనల్ (కప్ ఫైనల్) జరగనుంది.

ఇక ఈ హాంగ్ కాంగ్ సిక్సెస్ ఫార్మాట్ సాధారణ క్రికెట్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రతి జట్టులో కేవలం ఆరుగురు ఆటగాళ్లే ఉంటారు. మ్యాచ్ కూడా 6 ఓవర్ల పాటు మాత్రమే జరుగుతుంది. దీనివల్ల బ్యాటర్లు మొదటి బంతి నుంచే బాదేయాల్సి ఉంటుంది, బౌలర్లకు మాత్రం చిన్న తప్పు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వికెట్ కీపర్ మినహా మిగిలిన ఐదుగురు ఆటగాళ్లు కచ్చితంగా ఒక్కో ఓవర్ బౌలింగ్ చేయాలి. ఒక బౌలర్ గరిష్టంగా రెండు ఓవర్లు వేయవచ్చు, కానీ వరుసగా రెండు ఓవర్లు వేయడానికి వీల్లేదు. బ్యాటర్ 31 రన్స్ చేయగానే రిటైర్డ్ అవుట్ కావాలి, అయితే మిగతా బ్యాటర్లందరూ అవుటైతే ఆ ఆటగాడు మళ్లీ బ్యాటింగ్‌కు రావొచ్చు. కేవలం 6 ఓవర్ల మ్యాచ్ కాబట్టి క్షణాల్లో ఫలితం మారిపోతుంది, అందుకే భారత్-పాక్ పోరులో దూకుడుగా ఆడే బ్యాటర్లు, వేగంగా వికెట్లు తీసే బౌలర్లే కీలకం కానున్నారు.