Reading Time: < 1 minute
West Bengal Nandigram Bypoll Hasi Rani Rath Bjp Record Win

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించింది. నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఇక నందిగ్రామ్‌లో అయితే గత రికార్డ్‌లను బద్దలు కొట్టి కాషాయ పార్టీ గెలుపొందింది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హసీ రాణి రథ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై ఏకంగా 1.22 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1967 తర్వాత నందిగ్రామ్‌లో ఇదే అత్యధిక విజయంగా రికార్డ్ నమోదు చేసింది.

హసీ రాణి రథ్‌కు 1,64,227 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య విజయ మార్జిన్ 1,22,553 ఓట్లుగా నమోదైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థి 75 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా రికార్డ్ విజయం దిశగా వెళ్తోంది.

హసీ రాణి రథ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రథ్ తల్లి. ఈ ఏడాది మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో చంద్రనాథ్ రథ్ కాల్పుల్లో హత్యకు గురయ్యారు. హత్య ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రనాథ్ రథ్ తల్లి ఇప్పుడు నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ నియోజకవర్గం నుంచి కూడా విజయం సాధించారు. భవానీపూర్ గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన స్థానం. రెండు స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో సువేందు అధికారి నందిగ్రామ్ సీటును వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

నందిగ్రామ్‌లో గతంలోనూ భారీ విజయాలు నమోదయ్యాయి. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సువేందు అధికారి 81,230 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు హసీ రాణి రథ్ 1.22 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ రికార్డును అధిగమించారు.