Reading Time: 2 minutes
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

ఫ్లైదుబాయ్ విమానం లో జరిగిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకు జెరూసలేంలో అధ్యక్షుడు హెర్జోగ్ పౌర శౌర్య పతకాలను అందజేశారు. తాలి మేనెస్, జ్వికా మేనెస్, యానివ్ హయూన్, డాక్టర్ షోటా ముసాయేవ్, అసఫ్ రాజువాన్, ఓర్ పార్డిలోవ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. విమానంలో ప్రమాదాన్ని మొదట గుర్తించి ఇతరులను అప్రమత్తం చేయడంలో తాలి మేనెస్ కీలక పాత్ర పోషించారు. కో-పైలట్ దాడి చేసిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకోవడంలో యానివ్ హయూన్, జ్వికా మేనెస్, అసఫ్ రాజువాన్, ఓర్ పార్డిలోవ్ సహకరించారు. వైద్యుడైన డాక్టర్ షోటా ముసాయేవ్ గాయపడిన పైలట్‌కు ప్రాథమిక వైద్య సహాయం అందించారు. ఈ ఆరుగురిని సాధారణ పౌరులుగా కాకుండా, ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యం చూపిన నిజమైన వీరులుగా హెర్జోగ్ అభివర్ణించారు. వారి సాహసం వల్ల విమానంలో ఉన్న 174 మంది ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు.

స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన అధ్యక్షుడు

భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యం, వృత్తి నైపుణ్యం వల్ల పెను ప్రమాదం తప్పిందని హెర్జోగ్ అన్నారు. ఆరోగ్యం మెరుగుపడి ప్రయాణించగలిగే స్థితికి వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ తరఫున అత్యున్నత పౌర శౌర్య పురస్కారాన్ని అందజేయడం గౌరవంగా భావిస్తానని చెప్పారు. ప్రస్తుతం మచ్చర్ యూఏలోని అబుదాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమానంలో కో-పైలట్‌గా ఉన్న ఒమన్ జాతీయుడు హమ్మమ్ అల్-హమామీ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తొలుత సౌదీ అరేబియాలోని టబుక్‌లో చికిత్స అందించిన తర్వాత, మెరుగైన వైద్యం కోసం అబుదాబికి తరలించారు. భారత విదేశాంగ శాఖ కూడా మచ్చర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపింది. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ఆయనతో, ఆయన కుటుంబ సభ్యులతో, ఆసుపత్రి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడా?

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో 174 మంది ఉన్నారు. కో-పైలట్ హమ్మమ్ అల్-హమామీ కాక్‌పిట్‌లో గొడ్డలితో కెప్టెన్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో విమానం అత్యవసర సంకేతాలు పంపింది. సుమారు 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం వేగంగా 17,000 అడుగులకు పైగా కిందికి దిగింది.ఈ ఘటనను ఉగ్రదాడి ప్రయత్నంగా ఇజ్రాయెల్‌ ఆరోపించింది. అత్యవసర సమయంలో సహకరించిన ప్రయాణికులు, విమానాన్ని నియంత్రణలోకి తీసుకున్న పైలట్లకు కూడా హెర్జోగ్ కృతజ్ఞతలు తెలిపారు.

స్మిత్ మచ్చర్‌తో మాట్లాడిన నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటన సమయంలో స్మిత్‌ చూపిన ధైర్యాన్ని ప్రశంసించి ప్రపంచ హీరోగా మచ్చర్‌ను అభివర్ణించారు. ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జ్యోతి వెలిగించేందుకు రావాలని మచ్చర్‌ను నెతన్యాహు ఆహ్వానించారు. సాధారణంగా ఈ గౌరవం ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే ఇస్తామని, అయితే మచ్చర్‌ను కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ హీరోగా స్వీకరించారనీ అన్నారు.