Reading Time: < 1 minute
Empower India Share Price Surge Penny Stock Gains

భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి వంటి కారణాల వల్ల సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవడం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ వంటి అనేక కారణాలతో మార్కెట్లు పతనమవుతున్నప్పటికీ, కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎంపవర్ ఇండియా లిమిటెడ్’ (Empower India Ltd) ఒకటి.

గత ఐదు రోజులుగా ఈ షేరు ధరలో నిరంతరం పెరుగుదల కనిపిస్తోందని, ఈ అయిదు రోజుల్లోనే దాదాపు 30 శాతం వరకు వృద్ధి చెందిందని నివేదికలు చెబుతున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు సుమారు 5 శాతం లాభపడి రూ. 1.91 స్థాయికి చేరుకుంది. లాంగ్ టర్మ్‌లోనూ ఈ షేరు అత్యుత్తమ పనితీరు కనబరిచింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. అంటే 2022 నవంబర్ 7న ఈ షేరు ధర కేవలం 15 పైసలుగా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 1.92 వరకు పెరిగి, సుమారు 1,180 శాతం భారీ రాబడిని అందించింది. ఒకవేళ నాడు ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, వారి పెట్టుబడి విలువ ఇప్పుడు సుమారు రూ. 12.80 లక్షలకు చేరి ఉండేది.

ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 2.83గా, కనిష్ట ధర రూ. 1.03గా నమోదైంది. శుక్రవారం ఉదయం షేరు ధర రూ. 1.85 వద్ద ప్రారంభమై, ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన రూ. 1.93ని తాకడంతో పాటు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను కూడా తాకింది. అయితే… ఇది చాలా తక్కువ ధర కలిగిన పెన్నీ స్టాక్ కావడంతో ఇందులో తీవ్రమైన ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని, కేవలం గతం ఇచ్చిన పాత రాబడులను చూసి మాత్రమే ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. ఇన్వెస్ట్ చేసేముందు కంపెనీ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.