Reading Time: 2 minutes

ప్రపంచ తపాలా దినోత్సవం వెనుక భారతీయుడు..ఎవరీ ఆనంద్ మోహన్ నరూలా?

Caption of Image.

ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. తపాలా సేవలు ప్రజల జీవితాల్లో, వ్యాపార రంగంలో, దేశాల మధ్య సమాచార మార్పిడిలో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకోవడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్బంగా ఒకే తపాలా నెట్‌వర్క్‌ ద్వారా అపరిమిత అవకాశాలు అనే 2026 ప్రపంచ తపాలా దినోత్సవ థీమ్తో అక్టోబర్ 9 నుంచి 15 వరకు భారత తపాలా శాఖ జాతీయ తపాలా వారోత్సవాన్ని నిర్వహిస్తున్నది.  అయితే ప్రపంచ తపాల దినోత్సవం ఆద్యుడు ఆనంద్ మోహన్ నరూలా మన భారతీయుడే. 

తపాలా దినోత్సవం వెనుక చరిత్ర

ప్రపంచ తపాలా దినోత్సవానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల మధ్య తపాలా సేవలను సమన్వయం చేయడం, ఉత్తరాలు, వస్తువుల రవాణాను సులభతరం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అనంతరం 1969లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన యూపీయూ కాంగ్రెస్‌లో  భారతీయుడైన ఆనంద్ మోహన్ నరూలా ప్రతిపాదించగా అక్టోబర్ 9ని  ప్రపంచ తపాలా దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మానవ జీవితంలో, వ్యాపార రంగంలో తపాలా వ్యవస్థ (పోస్టల్ సేవలు) పాత్రను పోషించింది. ప్రపంచ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో దాని సహకారం మరువలేనిది. ఈ పోస్టల్ వ్యవస్థలో ఎందరో మనహనీయులు విశేష సేవలందించారు. వీటన్నింటిని గుర్తుచేసుకునేందుకు, అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ రోజును నిర్వహిస్తారు. మన దేశంలో అక్టోబర్ 9-15 తేదీలను జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

జాతీయ తపాలా వారోత్సవాలు..

భారత ప్రభుత్వ తపాలా శాఖ (Department of Posts) అక్టోబర్ 9 నుంచి 15 వరకు జాతీయ తపాలా వారోత్సవాలు 2026 (National Postal Week) నిర్వహిస్తున్నది. పౌరుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా తపాలా సేవలను మరింత సౌకర్యవంతంగా, సులభంగా అందుబాటులోకి , వేగంగా స్పందించేలా మార్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ వారోత్సవాల నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వారోత్సవాలను ఒకే పోస్టల్ నెట్‌వర్క్, అపరిమిత అవకాశాలు అనే మెయిన్ థీమ్ తో(Theme) ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

ALSO READ ; ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు షాక్..

డిజిటల్ యుగంలో పోస్టాఫీసుల హవా..

స్మార్ట్‌ఫోన్లు, ఈమెయిల్స్, మెసేజింగ్ యాప్స్ వచ్చినప్పటికీ తపాలా శాఖ అవసరం తగ్గిపోలేదు. ముఖ్యంగా ఈ-కామర్స్ పార్సిళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు, పొదుపు పథకాలు, ప్రభుత్వ సేవల చేరవేతలో పోస్టాఫీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2026లో N జెన్ పోస్టాఫీసులు, జన్ సేవా కనెక్ట్ పోస్టాఫీసులు, డాక్ సేవ, డాక్ మిత్రాయాప్ యాప్‌ల ద్వారా భారత తపాలా శాఖ సేవలను మరింత సులభతరం చేసింది. 

కాలం మారినా తపాలా సేవల ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. సంప్రదాయ ఉత్తరాల నుంచి డిజిటల్ సేవల వరకు ఎన్నో మార్పులను అందిపుచ్చుకుంటూ పోస్టల్ శాఖ ప్రజలకు చేరువవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక, ప్రభుత్వ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించడంతో పాటు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సేవలను వేగంగా ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ తపాలా దినోత్సవం వెనుక భారతీయుడి ఆలోచన ప్రస్తావించబడటం దేశానికి గర్వకారణం.

©️ VIL Media Pvt Ltd.