
హైదరాబాద్: జంతువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫతుల్లాగూడలోని ఏబీసీ (ABC) కేంద్రంలో అల్ట్రాసౌండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జంతువుల ఆరోగ్య సంరక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలనే లక్ష్యంతో ఎంఎంసీ అధికారులు కొత్తగా అల్ట్రాసౌండ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ అల్ట్రాసౌండ్ యంత్రం ద్వారా జంతువుల్లో గర్భధారణను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వివిధ అనారోగ్య సమస్యలను సులభంగా నిర్ధారించేందుకు వీలవుతుంది. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, అవసరమైన చికిత్సను సకాలంలో అందించేందుకు ఈ సేవలు దోహదపడనున్నాయి.
ఆధునిక వైద్య సాంకేతికతను వినియోగించడం ద్వారా జంతువులకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు పశువైద్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త సదుపాయంతో ఫతుల్లాగూడ ఏబీసీ కేంద్రంలో జంతువుల ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ సేవలు మరింత మెరుగుపడనున్నాయి.