
CM Chandrababu: ప్రతి నెలా ఆర్థిక నివేదికలు సమర్పిచడంతో పాటు… ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సెప్టెంబర్ నెల ఆర్థిక నివేదికను ప్రణాళిక శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…” రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ప్రతి నెల సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. రిపోర్టులు తీసుకుని చర్చించుకోవడం కాకుండా… ఆ నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఉన్నతాధికారులు మొదలుకుని… జిల్లా కలెక్టర్లు.. క్షేత్ర స్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలి అని సూచించారు చంద్రబాబు. ఆర్థిక నివేదికలను ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు అందించాలి. ఏమేం అంశాలు సరి చేసుకోవాలో అనే విషయాలను వారికి వివరించాలి. వ్యవసాయ రంగంలో వృద్ధి కన్పిస్తోంది. అదే తరహాలో సేవల రంగం, పరిశ్రమల రంగం కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదికల ఆధారంగా తమ తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలి. అలాగే వివిధ నిపుణుల సలహాలను తీసుకోవాలి. ఈ మేరకు నిపుణుల బృందాన్ని గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో ఎక్కడెక్కడ ఉత్తమ పద్దతులు ఉన్నాయో గుర్తించి.. వాటిని ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు అమలు చేయాలని పేర్కొన్నారు… ఏ ప్రభుత్వమూ చేయని విధంగా నియోజకవర్గాల స్థాయిలో ప్రణాళికలను అమలు చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అవకాశాలను ప్రపంచ మార్కెట్‌కు చేరేలా చూడాలని ప్రధాని సూచించారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో విజన్ యూనిట్ ప్లాన్లు అమలు చేయాలి. ధరలు పెరగకుండా చూడాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు..