
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాలాలను దాటి సాగే కథాంశం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది.
అయితే ఈ పాన్-వరల్డ్ సెన్సేషన్ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరితో జతకడతారు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా పేరు కాస్త గట్టిగానే వినిపించినప్పటికీ.. లెక్కల మాస్టారు’పుష్ప’ ఫేమ్ సుకుమార్ వైపే సూపర్ స్టార్ మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘1-నేనొక్కడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
అప్పట్లోనే సుకుమార్‌తో మరో సినిమా చేయాల్సింది ఉన్నప్పటికీ క్రేజీ డిఫరెన్సెస్ వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ‘వారణాసి’ లాంటి గ్లోబల్ అడ్వెంచర్ తర్వాత సుకుమార్‌తో ఆ అన్‌ఫినిష్డ్ విజన్‌ను పూర్తి చేయాలని మహేష్ ఆసక్తిగా ఉన్నారట. దీంతో మహేశ్–సుకుమార్ మరోసారి కలిస్తే ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తారనే చర్చ మొదలైంది.
ALSO READ : చారీ గారూ.. మళ్లీ వస్తున్నారా ఏంటి?
అయితే, ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు బాలీవుడ్ లేదా కోలీవుడ్ దర్శకులతో మహేశ్ సినిమా చేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. మహేశ్–సుకుమార్ కాంబో మూవీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.