Reading Time: < 1 minute
Isro Privatisation V Narayanan Private Sector Space Reforms

ISRO:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రైవేటీకరణ కాదని సంస్థ చైర్మన్ డాక్టర్ వి. నారయణన్ స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇస్రో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇస్రో చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తాము ఇస్రో ఉద్యోగుల్లో ఆందోళనల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూర్ స్పేస్ ఎక్స్‌పోలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతరిక్ష రంగ సంస్కరణలు ఆరేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని, ప్రైవేట్ రంగానికి మార్గనిర్దేశం చేయడం, భారత అంతరిక్ష వ్యవస్థను మరింత విస్తరించడం సంస్కరణల లక్ష్యమని ఆయన వివరించారు. స్పేస్ ఇండస్ట్రీలో ప్రైవేట్ పరిశ్రమ కొత్తది కాదని, రాకెట్ల తయారీలో ఇప్పటికే వందలాది భారతీయ కంపెనీలతో కలిసి ఇస్రో పనిచేస్తుందని తెలిపారు. PSLV లేదా GSLV ప్రయోగం జరుగుతున్నప్పుడు మొత్తం పని ఇస్రోనే చేస్తుందని అనుకోవద్దని, సుమారు 80 శాతం బడ్జెట్ పెట్టుబడులు భారత పరిశ్రమల నుంచే వస్తున్నాయని, దాదాపు 450 పరిశ్రమలు మాతో కలిసి పనిచేస్తున్నారని నారాయణన్ చెప్పారు.

భారతదేశానికి ఏడాదికి సుమారు 50 లాంచ్ వెహికల్స్ అవసరం ఉంటుందని, ఇంత పెద్ద స్థాయిలో రాకెట్ల అవసరాలను తీర్చాలంటే ఇస్రోతో పాటు భారీ పారిశ్రామిక వ్యవస్థ కూడా అవసరమని ఇస్రో చీఫ్ వెల్లడించారు. ఇస్రోలో 20 వేల మంది ఉద్యోగులం ఉన్నామని, వారి ఆందోళనల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం అంటే, ఇస్రో పాత్ర తగ్గించడం కాదని క్లారిటీ ఇచ్చారు.