
పండగల సీజన్ దగ్గరపడింది. వినాయక చవితి నుంచి జనవరిలో వచ్చే సంక్రాంతి వరకూ ప్రతి నెల పండుగల హోరు తెలుగింట మెుదలు కాబోతోంది. అయితే ఈ సారి పండగ సీజన్‌లో షాపింగ్ చేయాలని చూస్తున్న వారికి షాకిచ్చే వార్త ఇది. భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల గ్లామర్‌తో షాపులను ముంచెత్తే రోజులు ఇక కనుమరుగవుతున్నాయి. తయారీ నుంచి రవాణా, ప్యాకింగ్ వరకు అన్ని ఖర్చులు విపరీతంగా పెరగడంతో బట్టల షాపులు ఈసారి డిస్కౌంట్ల వ్యూహానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాయట. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ వెల్లడించారు.
పెరుగుతున్న రామెటీరియల్ భారం రిటైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మునుపటిలా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తే తమ మార్జిన్లు పూర్తిగా దెబ్బతింటాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఫైబర్ ధరలు భారీగా పెరగగా, ఇంధన ధరలు ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు అధికం అయ్యాయి. దీనికి తోడు రష్యా, మధ్యప్రాచ్య దేశాల ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని క్యారీ బ్యాగ్స్ వంటి కీలక ప్యాకింగ్ వస్తువుల కొరత కూడా వేధిస్తోంది.
అయితే డిస్కౌంట్లు లేకపోయినా.. వినియోగదారులను ఆకర్తించడానికి రిటైలర్లు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసారి వినూత్నమైన డిజైన్లు, సరికొత్త స్టాక్‌తో పాటు ఫిజికల్ రిటైలింగ్‌లో కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే తమ ప్రధాన వ్యూహమని రాజగోపాలన్ స్పష్టం చేశారు. టాటాలకు చెందిన ట్రెంట్, అంబానీల రిలయన్స్ రిటైల్, ఆదిత్య బిర్లా వంటి దిగ్గజ సంస్థలు కూడిన ఈ రంగంలో.. కేవలం సేల్స్ పెంచుకోవడం కంటే లాభాలను కాపాడుకోవటంపైనే ఫోకస్ పెడుతున్నాయి.
మరోవైపు స్టాఫ్ కొరత కూడా ఈ సీజన్‌లో రిటైలర్లను తీవ్రంగా కలవరపెడుతోంది. ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో స్టోర్లలో పనిచేయడానికి తగిన సిబ్బంది దొరకడం కష్టంగా మారిందని, కస్టమర్లను ఆప్యాయంగా ఆకట్టుకునే నైపుణ్యాలున్న వ్యక్తుల కొరత ఎక్కువైందట. గతంలో ‘అధిక మాసం’ కారణంగా మొదటి త్రైమాసికంలో పెళ్లిళ్లు, పండుగ కొనుగోళ్లు కాస్త మందగించినప్పటికీ.. ఈ పండుగ సీజన్‌లో మాత్రం డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు.
మొత్తానికి ఈ పండుగ సీజన్ షాపింగ్ కేవలం రేట్ల తగ్గింపుపై కాకుండా.. ప్రీమియం ఫీల్, వినూత్న ఉత్పత్తులపైనే ఆధారపడి ఉండనుంది. మిడ్-మార్కెట్ వర్గాలు కొన్ని ఆఫర్లను ఆశించవచ్చు కానీ.. బ్రాండెడ్, ప్రీమియం విభాగాల్లో మాత్రం పూర్తి ధరలకే కొనుగోళ్లు కొనసాగనున్నాయి. కాబట్టి ఈసారి పండక్కి మీ బడ్జెట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోండి.