Reading Time: 2 minutes

బ్యాడ్ లాంగ్వేజీకి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి సీతక్క

Caption of Image.

స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో  మంత్రి సీతక్క మండిపడ్డారు.  బ్యాడ్ లాంగ్వేజీకి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని మంత్రి సీతక్క  తీవ్రస్థాయిలో విమర్శించారు. దళిత స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన తాతా మధు, నవీన్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. దళిత స్పీకర్‌నుఅధ్యక్షా అని పిలవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని సీతక్క ఆరోపించారు.

పార్టీ నాయకులను ఫాంహౌస్‌కు పిలిపించి ఉసిగొల్పారని, దళిత నేతను అవమానించడం వెనుక కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌కు మొదటి నుంచీ దళితులంటే పడదని ఆరోపించిన సీతక్క.. నేరెళ్ల ఘటనను కూడా ప్రస్తావించారు.  దళిత బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండటం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. తాతా మధును వెంటనే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..?

సోమవారం (సెప్టెంబర్ 7)  తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా…   కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్ అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీ షర్ట్‎లతో ప్రతిపక్ష బీఆర్ఎస్ అసెంబ్లీకి వచ్చారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. బ్లాక్ టీ షర్టులతో లోపలికి అనుమతించలేదు. తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర ఆగ్రహానికి గురై  స్పీకర్‎ను ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు అన్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి కనీస మర్యాద ఇవ్వకుండా బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం నచ్చకే బీఆర్‌ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను శాసన సభలో సీఎం , మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని తక్షణమే డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.