Reading Time: 2 minutes
వార్నీ.. ఇంత సింపులా.. ఇలా చేస్తే ఇంట్లోనే పుదీనా గుబురుగా పెరగడం పక్కా..

ఈ ఆధునిక కాలంలో జంక్ ఫుడ్‌తో కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కామన్‌గా మారాయి. ఇలాంటి సమయంలో వంటింట్లో సులభంగా లభించే పుదీనా ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. కేవలం వంటకాలకు చక్కటి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలో, కడుపును ప్రశాంతంగా ఉంచడంలో పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో దొరికే పుదీనా కంటే మన ఇంటి బాల్కనీలోనే ఎలాంటి రసాయనాలు లేకుండా తాజాగా, ఆర్గానిక్‌గా పుదీనాను ఎలా పెంచుకోవచ్చో నిపుణులు కీలక సూచనలు చేశారు. పుదీనాలో ఉండే మెంథాల్ గుణాలు జీర్ణ ఎంజైమ్‌లను యాక్టివ చేస్తాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలు దరిచేరవు. కాలానుగుణంగా వచ్చే పేగు సంబంధిత ఇబ్బందులను నివారించడంలో ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని కాపాడుకోవడానికి రోజూ తాగే నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి తాగడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ పుదీనా మేలు చేస్తుంది. ఇందులోని సహజ సువాసన నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి, అలసటను దూరం చేస్తుంది. రాత్రి వేళల్లో పుదీనా ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. నిమ్మరసం, పుదీనా కలయికలో తీసుకునే తాజా డ్రింక్స్ శరీరానికి తక్షణ ఉత్సాహాన్నిస్తాయి.

బాల్కనీలోనే ఈజీగా పుదీనా సాగు..

ఈ సీజన్‌లో ఉండే తేమ వాతావరణం వల్ల పుదీనా కాండాలు చాలా వేగంగా వేర్లు తొడిగి పెరుగుతాయి. ఇంట్లోనే దీన్ని సులభంగా పెంచుకునే పద్ధతి:

మట్టి తయారీ: చిన్న కుండీలో తోట మట్టికి కాస్త సహజసిద్ధమైన సేంద్రీయ ఎరువు కలిపి సిద్ధం చేసుకోవాలి. రసాయన ఎరువులను వాడకపోవడమే మంచిది.

కాండాల ఎంపిక: మార్కెంట్ నుంచి తెచ్చిన పుదీనా కట్టల్లో కాస్త లావుగా, ముదిరిన కాండాలను ఎంచుకోవాలి. వేర్లు లేదా కణుపులు ఉన్న కాండాలను ఒక రాత్రి నీటిలో నానబెట్టాలి.

నాటే విధానం: కాండం కింది భాగంలో ఉన్న ఆకులను తుంచేసి, పైభాగంలో రెండు మూడు ఆకులు మాత్రమే ఉంచాలి. కుండీలోని మట్టిలో చిన్న రంధ్రాలు చేసి, ఈ కాండాలను నాటాలి. ఒక కుండీలో 5-6 కాండాలు నాటితే సరిపోతుంది.

సంరక్షణ: కుండీని మంచి గాలి, సహజ వెలుతురు సోకే చోట ఉంచాలి. రోజూ కొద్దిగా నీటిని స్ప్రే చేస్తూ ఉంటే, కొద్ది రోజుల్లోనే సరికొత్త చిగుళ్లు వచ్చి పచ్చని తాజా పుదీనా సిద్ధమవుతుంది.