Reading Time: < 1 minute
Are Romance Bold Content And Intimate Scenes Being Viewed As A Safe Formula For Low Budget Films

చిన్న సినిమా అంటే కొత్త కథ.. కొత్త ప్రయోగం.. కొత్త టాలెంట్‌కు అవకాశం అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. లో బడ్జెట్ సినిమాలకు రొమాన్స్.. బోల్డ్ కంటెంట్.. ఇంటిమేట్ సీన్స్‌నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారు. ఈ మధ్య వస్తున్న కొన్ని చిన్న సినిమాలను చూస్తుంటే.. హీరో, హీరోయిన్.. లవ్.. రొమాన్స్.. ఎమోషన్.. దీని చుట్టూ కథను నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది.

‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మళ్లీ కలిసి నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. లండన్ బ్యాక్‌డ్రాప్.. కాలేజ్ వాతావరణం.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.. రొమాన్స్.. మధ్యలో ఎమోషనల్ టర్న్స్.. ట్రైలర్ చూస్తే మరోసారి యువత ప్రేమనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.సినిమా పేరు ‘ఎపిక్’ అయినా.. కథ మాత్రం మరో రెగ్యులర్ యూత్ లవ్ రొమాంటిక్‌ స్టోరీగా మారిపోతుందా అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ‘హుషారు పిట్టలు’ కూడా యూత్ రొమాన్స్‌నే నమ్ముకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యూత్‌లో ఆకర్షణ, సీక్రెట్‌ రిలేషన్, బోల్డ్ రొమాన్స్, యూత్ కంటెంట్‌నే మార్కెటింగ్ ఆయుధంగా మార్చుకున్నట్టుగా కనిపించింది. థియేటర్స్ లో కొంత వసూళ్లు రాబట్టింది. ఇక ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రం రొమాన్స్‌ను తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో ముడిపెట్టింది. సాధారణ యువకుడు రాజు.. అమాయకమైన రాంబాయి.. ఇద్దరి మధ్య ప్రేమ.. ఆ ప్రేమ గెలవాలంటే, ప్రెగ్నెన్సీ ఐడియాతో రొమాన్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే, రియలిస్టిక్ టచ్‌తో కథను చెప్పే ప్రయత్నం చేయడంతో సక్సెస్ సాధించారు.

అయితే ఈ మూడు సినిమాలను కలిపి చూస్తే ఒక పాయింట్ మాత్రం కనిపిస్తోంది. చిన్న సినిమా అంటే ప్రేమకథ.. ప్రేమకథ అంటే యూత్ టార్గెట్.. ఇదే ఇప్పుడు సేఫ్ ఫార్ములాగా మారిపోతోందా? ‘ఎపిక్’లో కాలేజ్ లవ్ అండ్ రొమాన్స్, ‘హుషారు పిట్టలు’లో యూత్ రొమాన్స్.. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో పల్లెటూరి ప్రేమ.. మరి చిన్న సినిమాలు కూడా రొమాన్స్‌ను దాటి కొత్త జానర్స్‌లో రిస్క్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందనే అనుకోవాలి.