
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను నవ్వులతో ముంచేత్తే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు రూటు మార్చారు. ఈ సారి ‘కామ్రేడ్ కళ్యాణ్’ గా థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ నయా కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 9, 2026న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.
ఏంటీ కామ్రేడ్ కళ్యాణ్ కథ?
1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే పక్కా వినోదాత్మక చిత్రమిది. శ్రీవిష్ణు ఇందులో ‘తాటికొండ కళ్యాణ్’ అనే అత్యంత మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నారు. సాధారణంగా నక్సలైట్ అంటే తీవ్రమైన ముఖకవళికలు, చేతిలో గన్ గంభీరంగా గుర్తుకొస్తాయి. కానీ మన కళ్యాణ్ మాత్రం నక్సలైట్ ఉద్యమాన్ని కూడా కామెడీగా తీసుకునే ఒక విచిత్రమైన టైప్. ఓ వైపు పోలీసులు జల్లెడ పడుతుంటే, మరోవైపు నక్సలైట్ డ్రెస్సులోనే కథానాయిక మహిమా నంబియార్ వెనకపడి లవ్ ట్రాక్ నడిపించే కళ్యాణ్ మార్క్ అల్లరి నవ్వులు పూయిస్తోంది.
శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, అల్లరి మేనరిజమ్స్ వేరే లెవల్లో ఉండగా.. మహిమా నంబియార్ తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళ్యాణ్ తల్లిగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తనదైన నటనతో అలరించగా, మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ను పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్ ఆఫీసర్‌గా షైన్ టామ్ చాకో నెగెటివ్ అండ్ ఫన్నీ షేడ్స్‌లో మెరిశారు. వెన్నెల కిషోర్, సత్యతో పాటు టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు రంగంలోకి దిగడంతో వినోదం రెట్టింపు కానుంది.
►ALSO READ | బాక్సాఫీస్ దగ్గర ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డిజాస్టర్.. తొలిరోజు కేవలం 450 టికెట్లే సేల్!
దసరా రేసులో కామ్రేడ్..
ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం అందించారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు . ఇక విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు అక్టోబర్ 9, 2026న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ కామ్రేడ్ చేసే సందడి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.