
నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్లో100 పడకల ఏరియా హాస్పిటల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నకిరేకల్ ప్రజల చిరకాల కోరిక ఏరియా హాస్పిటల్ ప్రారంభోత్సవంతో నెరవేరింది.
సీఎం ప్రారంభించిన ఈ 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను రూ.32 కోట్లతో నిర్మించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్‌తో పాటు పరిసర ఆరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి.
నకిరేకల్ పట్టణంలో పాత జాతీయ రహదారి పక్కన 1990 కంటే ముందు 30 బెడ్స్‌తో పీహెచ్‌సీ ఉండేది. దానిని 1998లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మార్చారు. ఓపీ సంఖ్య రోజుకు 350 నుంచి 500 వరకు నమోదవుతుండడంతో 2022లో 100 బెడ్స్‌కు అప్‌గ్రేడ్ చేశారు.
జాతీయ రహదారి వెంట రూ.32 కోట్లతో బిల్డింగ్ నిర్మించారు. ఈ పనులు ఐదు నెలల కింద పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజుకు 200 నుంచి 250 వరకు ఓపీ వస్తోంది. కొత్త ఆసుపత్రి ప్రారంభం కావడంతో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.