Reading Time: < 1 minute
Kaushik Reddy Ethics Committee Six Weeks Time

Padi Kaushik Roddy : శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కమిటీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి తన పూర్తి వివరణ సమర్పించడానికి ఆరు వారాల సమయం కావాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఆగస్టు 31న తనకు ఎథిక్స్ కమిటీ నోటీసు అందిందని, సెప్టెంబర్ 5 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కమిటీ తనకు అందించిన మెటీరియల్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉందని, దానిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే పూర్తి వివరణ ఇవ్వగలనని స్పష్టం చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున, ఈ బిజీ షెడ్యూల్ కారణంగా తనకు తగినంత సమయం అవసరమని తెలిపారు.

పూర్తి వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి

మార్చి 29న జరిగిన ఘటనకు సంబంధించిన నాటి వీడియో క్లిప్ అసంపూర్తిగా ఉందని కౌశిక్ రెడ్డి లేఖలో వ్యాఖ్యానించారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజ్‌ను తనకు అందించాలని కోరారు. ముఖ్యంగా ట్రెజరీ బెంచ్ (పాలకపక్షం) , ప్రతిపక్షాల మధ్య జరిగిన సంభాషణల ఆధారాలను, అలాగే ప్రతిపక్షం వైపు నుండి ట్రెజరీ బెంచ్ వైపు కెమెరా చిత్రీకరించిన పూర్తి వీడియోను తనకు ఇవ్వాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిష్పాక్షికమైన వివరణ ఇవ్వడం సాధ్యమవుతుందని అన్నారు. పూర్తి మెటీరియల్ పరిశీలనకు ఆరు వారాల గడువు ఇవ్వాలని కోరిన కౌశిక్ రెడ్డి, ఒకవేళ అది వీలుకాని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాతైనా తనకు గడువు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని ఎథిక్స్ కమిటీని అభ్యర్థించారు.