Reading Time: 2 minutes
Jio 10 Years Explained How India Data Revolution Changed

Data Tsunami : 2016 సెప్టెంబర్ 5వ తేదీకి ముందు నాటి రోజులను ఒక్కసారి గుర్తుచేసుకోండి. మొబైల్‌లో ఒక్క మెసేజ్ రాగానే లేదా వెబ్‌పేజ్ ఓపెన్ కాగానే.. డేటా ఎక్కడ ఖర్చయిపోతుందోనని వెంటనే ‘మొబైల్ డేటా’ బటన్ ఆపేయడం మనలో చాలామందికి అలవాటుగా ఉండేది. వీడియో ప్లే చేయడం అటుంచితే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా నెలల తరబడి వాయిదా వేసుకునేవాళ్లం. నెలకు మహా అయితే 200 ఎంబీ వాడుతూ, ఒక్క జీబీ డేటా కోసం ఏకంగా 228 రూపాయలు సమర్పించుకున్న డిజిటల్ కరువు కాలమది! అలాంటి సమయంలో రిలయన్స్ జియో అడుగుపెట్టింది. సరిగ్గా పదేళ్లు గడిచాయి. తెలుగు రాష్ట్రాల్లో జియో సృష్టించిన ప్రకంపనలు అన్నీఇన్నీ కావు. ఒకప్పుడు మెగాబైట్ల కోసం ఆరాటపడ్డ ప్రజలు, ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 3కోట్ల 25లక్షల మంది చందాదారులతో జియో సరికొత్త చరిత్ర సృష్టించింది.

పదేళ్ల క్రితం భారతదేశంలో హైస్పీడ్ నెట్‌వర్క్ అంటే కొద్దిమంది సంపన్నులకే సాధ్యమయ్యేది. అప్పట్లో దేశవ్యాప్తంగా 4G కనెక్షన్లు ఉన్నది కేవలం కోటి మందికి లోపే. డౌన్‌లోడ్ స్పీడ్ 2.5 Mbps దాటడానికి ఆపసోపాలు పడేది. ఈ కష్టాలన్నింటికీ జియో బ్రేక్ వేసింది. ఇంటర్నెట్‌ను విలాసంగా కాకుండా, ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా మలిచింది. దాని ఫలితమే.. 2016లో 228 రూపాయలుగా ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ఇప్పుడు దాదాపు 97 శాతం తగ్గింది. కేవలం 7రూపాయల 90 పైసలకే లభిస్తోంది. అందుకే ఒక్కో జియో కష్టమర్ నెలకు ఏకంగా 42.3 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. దేశంలో 4G, 5G యాక్టివ్ యూజర్ల సంఖ్య సుమారు 93.8 కోట్లకు చేరింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI పరిధిలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ దేశంలోనే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జియో ప్రారంభమైన 2016 ఆగస్టు నెలలోనే 12లక్షల 40వేల మంది కస్టమర్లు చేరారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య 3కోట్ల 25లక్షలకు పైమాటే. ఈ పదేళ్లలో జియో నమోదు చేసిన CAGR అక్షరాలా 39.9 శాతం.

జియో రాకముందు తెలుగు గడ్డపై ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ తో పాటు టాటా టెలీసర్వీసెస్, ఆర్-కామ్, ఎయిర్‌సెల్, టెలినార్, వీడియోకాన్ వంటి 8కి పైగా కంపెనీలు ఉండేవి. కానీ జియో వచ్చాక మార్కెట్ ముఖచిత్రమే మారిపోయింది. 2016 ఆగస్టులో 164.1 లక్షల కనెక్షన్లు కలిగిన చిన్న కంపెనీలన్నీ జూలై 2019 నాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. జియోను తట్టుకునేందుకు వొడాఫోన్-ఐడియా ఒక్కటైనా ప్రయోజనం లేకపోయింది. బీఎస్ఎన్ఎల్ 97.5 లక్షల నుంచి 75.8 లక్షలకు పడిపోయింది. ఒక్క ఎయిర్ టెల్ మాత్రమే నిలబడగలిగింది. 3.9 కోట్ల కస్టమర్లతో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. జియో కేవలం ప్రత్యర్థుల కస్టమర్లను లాక్కోవడమే కాకుండా, మార్కెట్‌ను సైతం భారీగా విస్తరించింది. 2016 సెప్టెంబర్‌లో 7కోట్ల 47 లక్షలుగా ఉన్న తెలుగు రాష్ట్రాల మొత్తం యూజర్ల సంఖ్య, జూన్ 2026 నాటికి 18.1 శాతం పెరిగి 8కోట్ల 83లక్షలకు చేరింది. పల్లెలు, వెనుకబడిన వర్గాలకు మొట్టమొదటిసారి ఇంటర్నెట్ చేరువ కావడమే ఇందుకు కారణం. తక్కువ ధరకే డేటా దొరుకుతూ ఉండడంతో ఎక్కువ మందికి వాడడం మొదలుపెట్టారు. 2016లో నామమాత్రంగా ఉన్న డిజిటల్ వాలెట్ యూజర్లు 2026 నాటికి 55.6 కోట్లకు , ఓటీటీ వీక్షకులు 3 కోట్ల నుంచి ఏకంగా 60 కోట్లకు చేరారు.

గతంలో 4G ప్రపంచవ్యాప్తంగా 2009లో వస్తే, భారతదేశానికి రావడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. కానీ 5G విషయంలో జియో దూకుడు ప్రదర్శించింది. ప్రపంచంలో 5జీ 2019లో మొదలైతే, జియో 2022 చివర్లో రంగంలోకి దిగి, కేవలం 15 నెలల్లోనే దేశవ్యాప్తంగా 5G కవరేజీని పూర్తి చేసింది. 42 నెలల్లోనే 26.8 కోట్ల మంది 5G వినియోగదారులను చేర్చుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

అంతేకాదు, విదేశీ పరికరాలపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ క్లౌడ్-నేటివ్ స్టాండ్‌అలోన్ 5G ఆర్కిటెక్చర్‌ను జియో రూపొందించుకుంది. జియో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 40 శాతం మంది అంటే 11 వేల మందికిపైగా నిపుణులు కేవలం R&Dలోనే పనిచేస్తున్నారు. వీరు 4G, 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లలో ఏకంగా 6,817 పేటెంట్లను దాఖలు చేశారు. 2Gలో చిక్కుకుపోయిన 25 కోట్ల మందిని బయటకు తెచ్చేందుకు ‘జియోభారత్’ ఫోన్లు తీసుకొచ్చారు. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా 2.7 కోట్ల ఇళ్లకు దగ్గరయ్యారు.

పదేళ్ల క్రితం సాధారణ సిమ్ కార్డుతో మొదలైన జియో ప్రస్థానం.. నేడు దేశవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీ రూపురేఖలనే మార్చేలా చేసింది. కేవలం కాల్స్, డేటా అందించే టెలికాం కంపెనీ స్థాయి నుంచి నేడు క్లౌడ్, ఏఐ, ఐఓటీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో అగ్రస్థానంలో నిలిచింది. అన్‌లిమిటెడ్ డేటాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జియో.. రాబోయే రోజుల్లో 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా మరో మహా విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది.

:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)