
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలు, వారి రక్షణ, సంక్షేమం, అభివృద్ధిపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం నాలుగు అంచెల కార్యాచరణ అమలు చేస్తున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు. ప్రత్యేక రక్షణ వ్యవస్థతో పాటు రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్, రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2026లో 810 కేసుల పరిష్కారం
2026లో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద 810 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నమోదైన కేసులన్నీ పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ కేసుల పరిష్కారం కోసం 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు వివరించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన 1,478 కేసులకు సంబంధించి బాధితులకు రూ.15.43 కోట్ల పరిహారం అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాధితులకు రక్షణ, న్యాయం, సంక్షేమం అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
పలువురు ఉన్నతాధికారుల హాజరు
ఈ సమావేశానికి మంత్రులు డీబీవీ స్వామి, వి.అనిత, జి.సంధ్యారాణితో పాటు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, న్యాయశాఖ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించడంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థంగా పర్యవేక్షించడంపై సమావేశంలో చర్చించారు.