
Geoffrey Boycott Hails Ravindra Jadeja: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో జడేజాను తనకు ఇష్టమైన క్రికెటర్‌గా పేర్కొన్న బాయ్‌కాట్.. తాజాగా మరోసారి అదే మాట చెప్పాడు. ఈసారి జడేజా ఆట తీరుతో పాటు అతడి వ్యక్తిత్వం, లుక్‌ను కూడా ప్రత్యేకంగా ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. జడేజా చాలా హ్యాండ్సమ్ అని పేర్కొన్నాడు. జడ్డు ఉత్సాహం జట్టులోని ఇతర ఆటగాళ్లను కూడా ప్రభావితం చేస్తుందని బాయ్‌కాట్ అభిప్రాయపడ్డాడు.
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో విజయం సాధించడంలో ఆర్ జడేజా కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. తన ఆల్‌రౌండ్ సామర్థ్యంతో మరోసారి జట్టు విజయానికి ఉపయోగపడటంతో జెఫ్రీ బాయ్‌కాట్ కూడా జడేజాపై తన అభిమానాన్ని మరోసారి వెల్లడించాడు. ఓవర్‌ల్యాప్ క్రికెట్ యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడిన జెఫ్రీ బాయ్‌కాట్.. జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ను ప్రశంసించాడు. ‘జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడి ఫీల్డింగ్ ఇంకా అద్భుతం. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. ఎంతో బాధ్యతగా బ్యాటింగ్ చేస్తాడు. జడ్డు చాలా హ్యాండ్సమ్. మంచి వ్యక్తి కూడా. నేను అతడిని మొదటిసారి కలిసినప్పుడు.. నువ్వే నా ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పాను. అందుకు జడేజా ఆశ్చర్యపోయాడు. కానీ నేను నిజంగానే అన్నాను’ అని బాయ్‌కాట్ చెప్పాడు.
‘రవీంద్ర జడేజాలో నాకు నచ్చే ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆటలో ఎప్పుడూ చురుగ్గా ఉండటం, ఫీల్డింగ్‌లో పూర్తి శక్తిని ప్రదర్శించడం, బ్యాటింగ్‌లో పోరాట పటిమ చూపడం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. జడేజా కేవలం వ్యక్తిగతంగా మంచి ప్రదర్శనలు చేయడమే కాకుండా.. అతడి ఉత్సాహం జట్టులోని ఇతర ఆటగాళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఆటగాడిగా బాగా ఆడడం సాధారణమే. కానీ నీ ప్రదర్శనతో నీ చుట్టూ ఉన్న ఇతర ఆటగాళ్లను కూడా రాణించేలా చేయడం ముఖ్యమైన లక్షణం. జడేజా అద్భుతమైన శక్తితో ఫీల్డింగ్ చేస్తాడు. నవ్వుతూ కనిపించినా లోపల ఎంతో కఠినంగా, పోటీ భావనతో ఉంటాడు. అతడు సంపూర్ణ ఆల్‌రౌండర్’ అని బాయ్‌కాట్ కొనియాడాడు. జడేజా ఫీల్డింగ్‌లో చూపించే ఎనర్జీ, బ్యాటింగ్‌లోని పట్టుదల, బౌలింగ్‌లోని ఖచ్చితత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు.
రవీంద్ర జడేజా ఇటీవల మరో అరుదైన టెస్టు మైలురాయిని అందుకున్నాడు. టెస్టు చరిత్రలో 4000 పరుగులు, 350 వికెట్లను పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక జాబితాలో ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డేనియల్ వెట్టోరి, భారత దిగ్గజం కపిల్ దేవ్‌లతో కలిసి జడేజా చోటు సంపాదించాడు. గత దశాబ్దానికి పైగా భారత జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ జడేజా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచ కప్ వంటి టైటిల్ విజయాల్లోనూ భాగస్వామిగా ఉన్నాడు. జడేజా ఇటీవల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా పెట్టుకుని తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.