Reading Time: 2 minutes
Hardik Pandya To Stay With Mumbai Indians Big Ipl 2027 Twist

Hardik Pandya To Stay in Mumbai Indians for IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన తర్వాత హార్దిక్‌ను ట్రేడ్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా సమాచారం ప్రకారం హార్దిక్‌ను జట్టులోనే కొనసాగించాలని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. అయితే అతడిని కెప్టెన్‌గా కొనసాగించకుండా.. కొత్త నాయకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ విషయంలో పలు ఫ్రాంచైజీల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు హార్దిక్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఏ ట్రేడ్ కూడా ఫైనల్ కాలేదని సమాచారం. హార్దిక్ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. హార్దిక్ విషయంలో ముంబై, కోల్‌కతా మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముంబైకి సరైన ఆటగాడిని ట్రేడ్‌లో భాగంగా పొందే పరిస్థితి లేకపోవడంతో.. ఒప్పందం ముందుకు సాగలేదట.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ పేరును కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఆస్ట్రేలియా టెస్టు షెడ్యూల్, అతడి వర్క్‌లోడ్ వంటి అంశాలపై ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని సందేహాలు ఉన్నట్లు సమాచారం. దీంతో హార్దిక్‌ను ట్రేడ్ చేయడం కంటే జట్టులోనే కొనసాగించడం మేలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ ముంబైలోనే కొనసాగినా.. కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉందట. ఐపీఎల్ 2027 కోసం కొత్త నాయకత్వ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముంబై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2024లో హార్దిక్ మళ్లీ ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ నిర్ణయంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హార్దిక్‌ను పలుమార్లు ముంబై అభిమానులు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జట్టు విజయాల్లో నిలకడ లోపించడం, 2026లో మరోసారి నిరాశాజనక ఫలితం రావడంతో ఇప్పుడు నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఇప్పటివరకు 39 ఐపీఎల్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో 15 విజయాలు, 24 ఓటములు ఉన్నాయి. అతడి విజయ శాతం 38.46గా ఉంది.

ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 163 మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించి 91 విజయాలు అందించాడు. అతడి విజయ శాతం ఏకంగా 55.82గా ఉంది. హార్దిక్‌ను ప్లేయర్‌గా కొనసాగిస్తూ కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాలని ముంబై నిర్ణయిస్తే.. ఆ బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఫ్రాంచైజీ భవిష్యత్ నాయకత్వ ప్రణాళిక, రిటెన్షన్స్, వేలం వ్యూహం తదితర అంశాలపై ఆధారపడి ఈ నిర్ణయం ఉండనుంది.