Reading Time: < 1 minute
ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల ప్రకారం.. ఓ మహిళ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది.. ఈ క్రమంలోనే.. చేతబడి, క్షుద్రపూజల పేరుతో.. కరీంనగర్‌కు చెందిన శ్యామ్‌ కుమార్, వేములవాడ అగ్రహరంకి చెందిన లక్ష్మీరాజం.. ఆ మహిళను ఆశ్రయించారు.. అనారోగ్యాన్ని క్షుద్ర పూజలతో నయం చేస్తామంటూ మహిళ నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలను గీస్తూ ఆ మహిళను నమ్మించారని తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కరీంనగర్‌కు చెందిన శ్యామ్‌ కుమార్, వేములవాడ అగ్రహరంకి చెందిన లక్ష్మీరాజంను అరెస్ట్‌చేసి వాళ్ల నుంచి 30 లక్షల 50 వేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పూజలు, గుప్తనిధుల పేరుతో ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వీడియో చూడండి..