Reading Time: 2 minutes

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడించిన యూత్ కాంగ్రెస్

Caption of Image.
  • గేటుకు నల్లరంగు వేసి..అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
  • ఢిల్లీ, బిహార్‌‌ కాల్పులకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామాకు డిమాండ్
  • ప్రతిగా గాంధీభవన్​పై కోడిగుడ్లు విసిరిన బీజేపీ 
  • నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరు పార్టీల నేతల అరెస్ట్
  • బీజేపీ స్టేట్ ఆఫీస్‌‌ను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ, బిహార్‌‌లో విద్యార్థులపై జరిగిన కాల్పులు, అణచివేత ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్‌‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై మెరుపు దాడికి దిగాయి. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా, ప్రతిగా బీజేపీ శ్రేణులు గాంధీభవన్‌‌ను ముట్టడించి కోడిగుడ్లతో దాడికి పాల్పడటంతో నగరంలో హైటెన్షన్ నెలకొన్నది. 

సోమవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసుపైకి యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. ఆందోళనకారులు ఒక్కసారిగా కార్యాలయం లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఆఫీసు గేటుకు నల్లరంగు పూసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌ నేతలు మాట్లాడుతూ.. ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గేపై బీజేపీ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. 

గాంధీభవన్‌‌పై కోడిగుడ్లతో దాడి 

తమ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. బీజేపీ, బీజేవైఎం శ్రేణులు తిరగబడ్డాయి. వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌‌ ముట్టడికి యత్నించాయి. పోలీసులు అడ్డుకున్నా.. ముందుకు దూసుకుపోయాయి. ఈ క్రమంలో పలువురు బీజేవైఎం నేతలు గాంధీభవన్‌‌పైకి కోడిగుడ్లు విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరుపార్టీలకు చెందిన పలువురు నేతలను అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోపక్క.. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌‌‌‌రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ స్టేట్ ఆఫీసుతోపాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నేతల దాడిని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌‌ తదితరులు తీవ్రంగా ఖండించారు. 

పిరికిపంద చర్య: బీజేపీఎల్పీ నేత ఏలేటి 

బీజేపీ స్టేట్ ఆఫీసుపై దాడి పిరికిపంద చర్య అని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుండా రాజ్యం నడుస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పూర్తిస్థాయి హోంమంత్రి లేకపోవడంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల అరాచకాలు, పాలనా వైఫల్యాలు, గిరిజన నర్సు హత్య, మైనర్ బాలికపై అఘాయిత్యంలాంటి ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ దాడులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడులతో బీజేపీని భయపెట్టలేరని, భవిష్యత్తులో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.