Reading Time: < 1 minute

బాబాయ్ వాటా కొనేందుకు మేఘా కృష్ణారెడ్డి ప్లాన్.. రూ.6వేల 650 కోట్ల లోన్ కోసం చర్చలు!

Caption of Image.

ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(MEIL)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బిలియనీర్ పి.వి. కృష్ణారెడ్డి, తన బాబాయ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన పామిరెడ్డి పిచ్చిరెడ్డికి చెందిన వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కంపెనీలో 57 శాతం వాటా కలిగి ఉన్న కృష్ణారెడ్డి, మిగిలిన 43 శాతం వాటాను దక్కించుకోవడానికి గ్లోబల్ ప్రైవేట్ క్రెడిట్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.6వేల 650 కోట్ల నిధుల సమీకరణకు ప్లాన్ చేశారు. 

గ్లోబల్ దిగ్గజాల నుంచి భారీ నిధులు:
ఈ భారీ ఆర్థిక సర్దుబాటు కోసం డేవిడ్‌సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఎల్హామ్ క్రెడిట్ పార్ట్‌నర్స్, వార్డే పార్ట్‌నర్స్ వంటి ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ క్రెడిట్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ కనుక విజయవంతమైతే..2026లో భారతదేశంలో జరిగే అతిపెద్ద ప్రైవేట్ క్రెడిట్ లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలవనుంది. షాపూర్జీ పల్లోంజి గ్రూప్ గత నెలలో సేకరించిన రూ.15వేల 200 కోట్ల తర్వాత స్థానంలో ఈ ఒప్పందం నిలవనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.  

భారతదేశంలో ప్రైవేట్ క్రెడిట్ జోరు:
సాంప్రదాయ బ్యాంకుల కంటే ప్రైవేట్ క్రెడిటార్స్ మరింత సౌలభ్యమైన రూల్స్ అందించడం వల్ల పెద్ద కార్పొరేట్ డీల్స్‌లో వీటి హవా పెరుగుతోంది. మూడీస్ రేటింగ్స్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రైవేట్ క్రెడిట్ రంగం గత ఐదేళ్లలో రెట్టింపై 2025 చివరి నాటికి సుమారు రూ. 2లక్షల 37వేల500 కోట్లకు చేరుకుంది. కార్పొరేట్ సంస్థలు తమ ఫ్యామిలీ బిజనెస్‌లలో వాటాల మార్పుల కోసం కూడా ఇప్పుడు ప్రైవేట్ రుణాల వైపు మొగ్గుచూపుతున్నాయనడానికి ఇది నిరూపిస్తోంది. 

మేఘా ఇంజనీరింగ్ ప్రస్థానం:
హైదరాబాద్‌లో 1989లో ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్‌గా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో టన్నెల్స్, పోర్టులు, హైవేలు, వాటర్ సిస్టమ్స్, పవర్ ప్రాజెక్ట్‌లతో భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజంగా అవతరించింది. అయితే ఈ వాటాల కొనుగోలు, నిధుల సమీకరణకు సంబంధించిన చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. తుది విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని సమాచారం.

©️ VIL Media Pvt Ltd.