
కేజీఎఫ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తదుపరి చిత్రం ప్రకటించడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుని భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొదటి నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన స్టామినాను నిరూపించుకుంది. అయితే ‘టాక్సిక్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు యశ్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
యష్ లైనప్‌లో ప్రస్తుతం బాలీవుడ్ మల్టీస్టారర్ ‘రామాయణ్’ చిత్రం ఉంది. ఇందులో ఆయన రావణుడి పాత్రలో కనిపిస్తుండటంతో, అభిమానులు ‘టాక్సిక్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, యష్ తదుపరి సోలో ప్రాజెక్ట్ కోసం ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాకు హేమంత్‌తో పాటు యశ్ కూడా సహ రచయితగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ ‘టాక్సిక్’ ఫలితం తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో వేచి చూడాలి. దీనితో పాటు ‘కేజీఎఫ్ 3’ అధికారికంగా ప్రకటించినప్పటికీ అది త్వరలో ఉండే అవకాశం తక్కువ. అలాగే ‘సర్దార్’ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ మరియు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా యశ్ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.